Team India New Fitness Rules: భారత క్రికెట్ జట్టులో వరుస గాయాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్‌లో హర్షిత్ రాణా, యూకే టూర్‌లో నితీష్ కుమార్ రెడ్డి గాయపడి దూరమవ్వగా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయంతో శ్రీలంక టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అంతర్జాతీయ సీజన్ ఆరంభంలోనే కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకి దూరం కావడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఆటగాళ్ల మ్యాచ్ ఫిట్‌నెస్‌ను కచ్చితంగా అంచనా వేసేందుకు బ్రోంకో టెస్ట్ (Bronco Test), 2K రన్ (2K Run) బెంచ్‌మార్క్‌లను ప్రమాణీకరించాలని నిర్ణయించింది.
ఏంటి ఈ బ్రోంకో టెస్ట్?:
గతంలో రగ్బీ క్రీడలో ఉపయోగించిన ఈ టెస్ట్‌ను బీసీసీఐ 2025లో క్రికెట్‌లోకి తీసుకొచ్చింది. మైదానంలో 20 మీటర్లు, 40 మీటర్లు, 60 మీటర్ల వద్ద కోన్‌లు అమర్చుతారు. ఆటగాడు మొదట 20 మీటర్లు పరిగెత్తి వెనక్కి రావాలి, తర్వాత 40 మీటర్లు, ఆపై 60 మీటర్లు పరిగెత్తి రావాల్సి ఉంటుంది. ఏమాత్రం విశ్రాంతి లేకుండా వరుసగా 5 సెట్లు (మొత్తం 1.2 కిలోమీటర్లు) పూర్తి చేయాలి.. ఈ 1.2 కిమీల పరుగును 5.5 నుంచి 6 నిమిషాల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
యో-యో టెస్ట్ vs బ్రోంకో టెస్ట్:
విరాట్ కోహ్లీ-రవిశాస్త్రి హయాంలో ప్రాచుర్యంలోకి వచ్చిన యో-యో టెస్ట్ (కటాఫ్ 17.1) కంటే బ్రోంకో టెస్ట్ చాలా కష్టమైనదని డీడీసీఏ స్పోర్ట్స్ చీఫ్, ఫిజియో దీపక్ సూర్ తెలిపారు. యో-యో టెస్ట్‌లో 20 మీటర్లు పరిగెత్తాక రికవరీ కోసం 5 మీటర్లు నడిచే వెసులుబాటు ఉంటుంది. కానీ బ్రోంకో టెస్ట్‌లో వరుసగా యూ-టర్న్లు తీసుకుంటూ పరిగెత్తడంతో శరీరంలో శక్తి త్వరగా ఖర్చవుతుంది. టీ20 శకంలో కేవలం షార్ట్ స్ప్రింట్లపై ఆధారపడుతున్న ఆటగాళ్లకు ఈ టెస్ట్ పెద్ద సవాలుగా మారనుంది.
ALSO READ : టీమిండియా హిస్టారిక్ మూమెంట్.. ఇంగ్లాండ్, ఆసీస్ తర్వాత 600 టెస్టుల క్లబ్‌లోకి భారత్!
2K రన్ కటాఫ్ వివరాలు:
సరిగ్గా 2 కిలోమీటర్ల దూరం పరిగెత్తే ఈ టెస్ట్‌లో ఆటగాళ్ల స్థానాన్ని బట్టి కటాఫ్ సమయాన్ని నిర్దేశించారు. ఫాస్ట్ బౌలర్లకి 8.15 నిమిషాలు (8 నిమిషాల 15 సెకన్లు), బ్యాటర్లు & స్పిన్నర్లకి 8.50 నిమిషాలు (8 నిమిషాల 30 సెకన్లు) ఇచ్చారు. ఈ సమయం దాటితే ఆటగాడు ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఫెయిల్ అయినట్లే.. దేశవాళీ స్థాయిలో కొన్ని స్టేట్ అసోసియేషన్లు యో-యో లేదా 2K రన్‌లో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఇస్తున్నప్పటికీ, బీసీసీఐ మాత్రం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను ఖరారు చేస్తోంది. ఈ కఠిన నిబంధనలతో ప్లేయర్స్ లాంగ్-టర్మ్ ఫిట్‌నెస్ మెరుగై గాయాలు తగ్గుతాయని బీసీసీఐ భావిస్తుంది.
