ఇరాన్ వైపు మరో యుద్ధ నౌకల సమూహాన్ని పంపిన అమెరికా.. బాంబుల వర్షమే అంటున్న ఇరాన్.. యుద్ధం తప్పదా..?

ఇరాన్ వైపు మరో యుద్ధ నౌకల సమూహాన్ని పంపిన అమెరికా.. బాంబుల వర్షమే అంటున్న ఇరాన్.. యుద్ధం తప్పదా..?

ఇరాన్ వైపు మరో యుద్ధ నౌకల సమూహం బయల్దేరినట్లు యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ డీల్ కుదుర్చుకుంటుంది అనుకుంటున్నాం.. లేదంటే అందమైన యుద్ధ నౌకల సమూహం ఇరాన్ ను సమీపిస్తోంది.. అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. అమెరికా డల్లాస్ లోని క్లైవ్, లోవా లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న ట్రంప్.. ఇరాన్ కు హెచ్చరలు జారీ చేశారు. 

ఇప్పటికే పశ్చిమ ఆసియాలో USS అబ్రహం లింకన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ను మోహరించిన అమెరికా.. మరో వార్ షిప్ ల సమూహాన్ని పంపిస్తుండటం ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తోంది. ర్యాలీలో ట్రంప్ చేసిన కామెంట్స్ ఇరాన్ సహా పశ్చిమాసియా దేశాలను ఆందోళనలో పడేశాయి. 

మరో యుద్ధనౌకల సమూహం ఇరాన్ దిశగా వెళ్తోంది. చూద్దాం.. వాళ్లు సందికి వస్తారని అనుకుంటున్నా. లేదంటే చూద్దాం అంటూ.. చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇటు అమెరికా మిలిటరీ కూడా పెద్ద ఎత్తున యుద్ధ సన్నాహాలు చేస్తుండటం కలవరపెడుతున్న అంశం.

ఇరాన్ కు ఇజ్రాయెల్ హెచ్చరికలు:

ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్ పై ఇరాన్ దాడికి దిగితే.. ఇస్లామిక్ రాజ్యమైన ఇరాన్ దారుణ పరిణామాలను ఎదుర్కొంటుందంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ఇరాన్ పై అమెరికా దాడి చేయనుందన్న వార్తలు వస్తున్న క్రమంలో ఇజ్రాయెల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

అమెరికా మిత్ర దేశాల మాటేమిటి..? 

పశ్చిమ ఆసియాలో ఉన్న అమెరికా మిత్ర దేశాలు.. ఇరాన్ పై తీసుకున్న వైఖరికి మద్ధతు ఇవ్వడం లేదు. ఇరాన్ పై దాడి చేసేందుకు తమ దేశ గగన తలాన్ని వాడుకుంటే ఊరుకునేది లేదని సౌదీ అరేబియా హెచ్చరించింది. మరోవైపు యూఏఈ అమెరికా వైపు నిలిచింది. ఇరాన్ ను టార్గెట్ చేసేందుకు తమ దేశ  గగన తలం, భూ, జల ప్రాదేశిక ప్రాంతాలను వినియోగించుకునేందుకు సహకరించనున్నట్లు తెలిపింది.

అమెరికాకు సాయం చేస్తే బాంబుల వర్షమే: ఇరాన్

పశ్చిమ ఆసియా వాతావరణాన్ని దెబ్బతీసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నానికి సహాయం చేసే దేశాలపై జాలి చూపేది లేదు అని ఇరాన్ ప్రకటించింది. జాలీ , దయ లేకుండా అమెరికా సహాయం చేసే దేశాలపై నిర్ధాక్షిణ్యంగా బాంబుల వర్షం కురిపిస్తామని హెచ్చరించింది. మిడిల్ ఈస్ట్ కు యుద్ధనౌకలను పంపుతున్నాం అంటూ మరోసారి ట్రంప్ హెచ్చిరించిన తర్వాత ఇరాన్ పై విధంగా స్పందించింది. 

అటు ఇరాన్ లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఆర్థిక, రాజకీయ అనిశ్చిత్తితో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లలో ఇప్పటి వరకు 6 వేల  మందికిపైగా పౌరులు చనిపోయారు. మరోవైపు ఆందోళనకారులకు మద్ధతుగా అమెరికా నిలవడంతో.. అక్కడ అధికార  మార్పు జరిగే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.