టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఎన్.శంకర్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సక్కుబాయమ్మ వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా ఈ ఉదయం (2026 జనవరి 28న) తుదిశ్వాస విడిచారు.
ఆమె మరణ వార్త తెలుసుకున్న డైరెక్టర్ శంకర్ అభిమానులు, సినీ ప్రముఖులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. సక్కుబాయమ్మ అంత్యక్రియలు 2026, జనవరి 29, గురువారం మధ్యాహ్నం జరగనుంది. ఈ మేరకు రేపు ఉదయం నుండి HIG Block 11, చిత్రపురి కాలనీ, హైద్రాబాద్ లో సక్కుబాయమ్మ భౌతిక కాయాన్ని సందర్శించవచ్చు.
ఎన్.శంకర్ 1997లో ‘ఎన్ కౌంటర్’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్కి పరిచయమయ్యారు. తర్వాత ఆయన భద్రాచలం, శ్రీ రాములయ్య, యమజాతకుడు, ఆయుధం, జయం మనదే రా, జై బోలో తెలంగాణ వంటి చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ, తన ప్రత్యేక గుర్తింపును సంపాదించారు.
కమర్షియల్ మెయిన్‌స్ట్రీమ్ ఫార్మాట్‌లోనే తనదైన కమిట్‌మెంట్‌తో సామాజిక చైతన్యం కలిగించే చిత్రాలను రూపొందిస్తూ దర్శకుడు శంకర్ మంచి పేరు ఘడించారు. 2011లో ఆయన దర్శకత్వం వహించిన ‘జై బోలో తెలంగాణ’ చిత్రానికి ఏకంగా ఐదు నంది అవార్డులు లభించటం విశేషం. ఇకపోతే, డైరెక్టర్ నిమ్మల శంకర్ స్వగ్రామం నల్గొండ జిల్లా, మాడ్గులపల్లి మండలం, చిరుమర్తి.
