మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు:  మహిళలు పురుషులతో సమానంగా ఆర్థికంగా ఎదగాలని, ఇందుకోసం వారు ఏదో ఒక కోర్సులో శిక్షణ పొంది స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నల్గొండలోని సెట్విన్ సంస్థలో కుట్టు మిషన్ల శిక్షణ పూర్తి చేసుకున్న 116 మంది మహిళలకు ఆయన మిషన్లు, సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  నల్గొండ సెట్విన్ ద్వారా ఇప్పటివరకు 27 కోర్సుల్లో 1,250 మందికి శిక్షణ ఇచ్చామని, కంప్యూటర్ శిక్షణ పొందిన మహిళలను ప్రభుత్వ పాఠశాలల్లో ఇన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్టర్లుగా నియమిస్తామని వెల్లడించారు.

జిల్లాలో రూ. 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, నూతన కలెక్టరేట్ పనులు పూర్తయితే ఎలక్ట్రీషియన్, ప్లంబర్ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివిన వారికి మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే మూసి నది ప్రక్షాళన పనులను రెండు దశల్లో చేపడతామని, ఇందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. డిండి ప్రాజెక్టు పనులను కూడా త్వరితగతిన ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని గుర్తుచేశారు. కలెక్టర్ బి. చంద్రశేఖర్ , మేయర్ బుర్రి చైతన్య, అడిషనల్​ కలెక్టర్ అశోక్ రెడ్డి ఉన్నారు.