తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అపచారం జరిగింది. తిరుమలలో ఒక జంట వెడ్డింగ్ షూట్ కలకలం రేపింది. శ్రీవారి ఆలయం ముందు కొత్త దంపతుల ముద్దులు హద్దులు దాటాయి. ఈ జంట వివరాలు తెలియలేదు గానీ.. తిరుమలలో క్యూ లైన్ల దగ్గర సాంప్రదాయ వస్త్రాల్లో అమ్మాయి నుదుటిన పెళ్లి కొడుకు ముద్దు పెడుతుండగా ఫొటోగ్రాఫర్ రికార్డ్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు ఈ ఘటనపై మండిపడ్డారు.
తిరుమలలో ఫోటో షూట్లు, రీల్స్ చేయడం నిషేధం. అయినా గానీ కొందరు తెలిసీతెలియని చేష్టలతో ఆలయ పవిత్రతను మంటగలుపుతున్నారు. గతంలో సినీ నటి నయనతార తిరుమలలో చేసిన వెడ్డింగ్ షూట్ వివాదానికి దారితీసింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పదే పదే హెచ్చరిస్తున్నా కొందరి తీరు మారలేదు.
చుట్టూ అధునాతన నిఘా కెమెరాలు ఉన్నా సెక్యూరిటీ సిబ్బంది ఇలాంటి ఘటనను గుర్తించకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు రాజకీయ ప్రసంగాలు, సినిమా షూటింగ్లు, ఫోటో షూట్లు. రీల్స్ నిషేధం. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నా ఇలాంటి ఘటన మళ్లీ వెలుగులోకి రావడం గమనార్హం.
