ఉగాది రోజున స్టాక్ మార్కెట్ మహా పతనం : కర్పూరంలా కరిగిన 12 లక్షల కోట్లు..!

ఉగాది రోజున స్టాక్ మార్కెట్ మహా పతనం : కర్పూరంలా కరిగిన 12 లక్షల కోట్లు..!

భారత స్టాక్ మార్కెట్లు కరోనా తర్వాత మరోసారి భారీగా పతనం కొనసాగిస్తున్నాయి. ఉదయం ఓపెన్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఊహించని నష్టాల్లోకి జారుకున్న సూచీలు మధ్యాహ్నం ట్రేడింగ్ సెషన్లో నష్టాలను మరింతగా పెంచుకున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల సూచీలతో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.12 లక్షల కోట్లు ఆవిరైపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ స్టాక్స్ విలువ ఈ క్రమంలో 2 శాతం తగ్గింది. నేడు ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్ స్టాక్స్ క్రాష్ కావటం సూచీలను తలకిందులు చేసేసింది.

మధ్యాహ్నం 2.38 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 2300 పాయింట్ల నష్టంతో ట్రేడవుతుండగా.. నిఫ్టీ సూచీ 666 పాయింట్లు కోల్పోయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ సూచీ 1647 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1692 పాయింట్లు నష్టపోయాయి. దీంతో వరుసగా మూడు రోజులుగా లాభాల్లో కొనసాగుతున్న మార్కెట్లు ఉగాది పండుగ రోజున ఇన్వెస్టర్లకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఆటో, రియల్టీ, మెటల్ రంగాలకు చెందిన షేర్లలో జోరుగా అమ్మకాలు కొనసాగుతుండటం సూచీలపై ఒత్తిడి పెంచేస్తోంది.

ఈ రోజు మార్కెట్లలో హెవీ వెయిట్ బ్యాంకింగ్ స్టాక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్ల అనూహ్య పతనం కూడా మార్కెట్ల నష్టాలను పెంచేయటంలో భాగమైంది. దీనికి తోడు జొమాటో, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ షేర్లు కూడా భారీగా మార్కెట్లను నష్టాల్లోకి లాగటానికి కారణంగా మారాయి. అయితే ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్ ఇండియా కంపెనీల షేర్లు మాత్రం లాభాలతో ముందుకు సాగుతున్నాయి. 

మార్కెట్లో మెుత్తంగా లిస్టెడ్ షేర్లలో 885 లాభపడగా.. 2549 నష్టాల్లో కొనసాగుతున్నాయి. కేవలం 146 షేర్లు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా ముందుకెళుతున్నాయి. ప్రధానంగా అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే కొనసాగటం, క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 113 డాలర్లకు చేరుకోవటం ఇన్వెస్టర్లను వణికిస్తున్నాయి. ఇదే క్రమంలో ఇజ్రాయెల్, ఇరాన్ దాడుల్లో గ్యాస్ ప్లాంట్లు దెబ్బతినటం సప్లై సమస్యలను సృష్టిస్తుందనే ఆందోళనలు గ్లోబల్ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లను హారతి కర్పూరం లాగా ఆవిరి చేస్తున్నాయి. 

ఆయిల్ అండ్ గ్యాస్ దిగుమతులపై ఆధారపడే ఇండియా లాంటి దేశాల్లో ఈ పరిస్థితులు ద్రవ్యోల్బణాన్ని పెంచటంతో పాటు రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ వృద్ధిని దెబ్బతీస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేయటం మార్కెట్లలో సెంటిమెంట్లను దెబ్బతీస్తున్నాయి. ఇదే పరిస్థితులు యూరోపియన్ స్టాక్ మార్కెట్లు కూడా కనిష్టాలకు పతనం అయ్యాయి.