ఆమె పెళ్లి గురించి మీకెందుకు?.. అనుష్క టీమ్ నుంచి స్ట్రాంగ్ వార్నింగ్!

ఆమె పెళ్లి గురించి మీకెందుకు?.. అనుష్క టీమ్ నుంచి స్ట్రాంగ్ వార్నింగ్!

టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి వ్యక్తిగత జీవితంపై నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆమె వివాహం గురించి గత దశాబ్ద కాలంగా వందల సంఖ్యలో కథనాలు వచ్చాయి. తాజాగా, అనుష్క ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతోందంటూ నెట్టింట  మరోసారి జోరుగా ప్రచారం మొదలైంది. అయితే, ఈసారి ఈ పుకార్లపై అనుష్క టీమ్ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది.

వయసును ఎందుకు హైలైట్ చేస్తున్నారు?

లేటెస్ట్ గా అనుష్క అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఆమె టీమ్ ఒక సుదీర్ఘమైన నోట్‌ను విడుదల చేసింది. అందులో మీడియా సంస్థల తీరును తప్పుబడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అనుష్క వివాహం గురించి నిరంతరం పోస్టులు పెడుతున్న మీడియా పేజీలకు ఒకటే విన్నపం.. ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని హెడ్ లైన్స్ కోసం వాడుకోవడం సరికాదని మండిపడ్డారు. నిర్ధారణ లేని సమాచారాన్ని పదే పదే ప్రచురించడం జర్నలిజం అనిపించుకోదు.. అది ఇతరుల వ్యక్తిగత జీవితంలోకి చొరబడటమే అవుతుంది అని వారు పేర్కొన్నారు.

ముఖ్యంగా అనుష్క వయసు (44) గురించి ప్రస్తావించడాన్ని టీమ్ తీవ్రంగా ఖండించారు. ప్రతి పోస్ట్‌లోనూ ఆమె వయసును హైలైట్ చేయడం ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది పరోక్షంగా 'ఏజ్ షేమింగ్' చేయడమే అని మండిపడ్డారు. మరి ఇదే ఉత్సాహం మగ నటుల విషయంలో ఎందుకు ఉండదు? మహిళా నటుల విషయంలోనే కథనాలు ఎందుకు భిన్నంగా ఉంటాయి? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

పుకాార్లపై సీరియస్..

అనుష్క శెట్టి తన కెరీర్‌ను ఎప్పుడూ హుందాతనంతో, ప్రతిభతో నిర్మించుకున్నారు. ఇతర స్టార్లలాగా పబ్లిసిటీ స్టంట్స్ గానీ, నిరంతరం సోషల్ మీడియాలో కనిపించడం గానీ ఆమెకు ఇష్టం ఉండదు. తన వ్యక్తిగత జీవితాన్ని అత్యంత గోప్యంగా ఉంచే ఆమె వంటి వ్యక్తిపై ఇలాంటి పుకార్లు పుట్టించడం అన్యాయమని ఆమె టీమ్ అభిప్రాయపడింది. పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. అది బ్రేకింగ్ న్యూస్ కాదు, ట్రెండ్ అసలే కాదు అని స్పష్టం చేశారు.

గతంలోనూ ఇదే తంతు..

నిజానికి అనుష్క పెళ్లి వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు. 2020లో కూడా ఉత్తర భారతానికి చెందిన ఒక క్రికెటర్‌తో ఆమెకు వివాహం కాబోతోందంటూ వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా అనుష్క స్పందిస్తూ.. నా పెళ్లి ఎవరికైనా ఎందుకు అంత పెద్ద విషయమో అర్థం కావడం లేదు. ఒక బంధాన్ని ఎవరూ దాచలేరు. పెళ్లి చేసుకుంటే అందరికీ తెలిసేలా చేస్తాను. ఇలాంటి విషయాల్లో కాస్త సున్నితంగా వ్యవహరించండి అని హితవు పలికారు.

►ALSO READ | అందరూ అవే మాటలు.. అదే కంటెంట్ కదా చూస్తుంది : భర్త KD సాంగ్ బూతులను సమర్థించిన రక్షిత

ప్రస్తుతం అనుష్క తన తదుపరి చిత్రాలపై దృష్టి సారించారు. త్వరలో ఆమె 'కథనార్: ది వైల్డ్ సోర్సెరర్' (Kathanar: The Wild Sorcerer) అనే భారీ బడ్జెట్ చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇందులో జయసూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఫాంటసీ ,హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అనుష్క పెళ్లి కంటే ఆమె వెండితెరపై చేసే మ్యాజిక్ కోసమే ప్రేక్షకులు ఎదురుచూడాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.