ఈ ఇంజినీర్ అవినీతి ఇంటర్నేషనల్ లెవల్: నేపాల్ లో ఇల్లు, టీ ఎస్టేట్, గ్యాస్ ఏజెన్సీ..!

ఈ ఇంజినీర్ అవినీతి ఇంటర్నేషనల్ లెవల్: నేపాల్ లో ఇల్లు, టీ ఎస్టేట్, గ్యాస్ ఏజెన్సీ..!

పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. కాదు ఇంటర్నేషనల్ అన్న డైలాగ్‎ను నిజం చేశాడు ఓ అవినీతి అధికారి. తన అవినీతిని విదేశాలకు విస్తరించాడు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఇల్లు, టీ ఎస్టేట్, గ్యాస్ ఏజెన్సీ పెద్ద దుకాణమే తెరిచాడు. యాంటీ కరప్షన్ బ్యూరో అధికారుల సోదాల్లో ఈ అవినీతి తిమింగలం అక్రమ బాగోతం బయటపడింది. ఈ అవినీతి దందా చూసి అధికారులే అవాక్క్ అయ్యారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. 

అధికారుల వివరాల ప్రకారం.. రజక్ అనే అధికారి ప్రస్తుతం జయనగర్‌లోని సప్లై డివిజన్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఆయనపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆర్థిక నేరాల విభాగం అధికారులు బుధవారం (మార్చి 18) రజక్ నివాసంపై మెరుపు దాడులు నిర్వహించారు. రజక్ నివాసం, అతని కార్యాలయం, అతని బంధువుల ఇండ్లలో ఏకకాలంలో అధికారులు రైడ్స్ చేశారు. మధుబని జిల్లాలోని దర్భంగా, జయనగర్, సుపాల్‌లోని నిర్మలి, కర్జైన్ పట్టణాలతో సహా ఏడు ప్రదేశాలలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రజక్ పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. 

►ALSO READ | ప్రపంచంలోనే అతిపెద్ద LNG కేంద్రంపై ఇరాన్ దాడి.. భారత్ పై తీవ్ర ప్రభావం!

హైవేల పక్కన ఉన్న ఆస్తులు, వాణిజ్య సంస్థలలో వ్యూహాత్మక పెట్టుబడులు, విదేశాల్లో కూడా ఇన్వెస్ట్ చేసినట్లు గుర్తించారు. అరేరియా, దర్భంగాలో ప్లాట్లు, అరేరియాలో ఒక గ్యాస్ ఏజెన్సీ,  బీమా పెట్టుబడులు,  సిలిగురిలో వాణిజ్య భూమి, డార్జిలింగ్‌లో ఒక టీ తోట ఉన్నట్లు గుర్తించారు. లంచాల ద్వారా వసూల్ చేసిన డబ్బుతో నేపాల్‎లో కూడా ఇల్లు కొనడం చూసి దర్యాప్తు అధికారులు ముక్కున వేలేసుకున్నారు. మొత్తం 31 భూమి పత్రాలు, నగలు, డబ్బు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు రజక్ పై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రజక్ కొంత కాలంలోనే పెద్ద మొత్తంలో అవినీతి పడగలెత్తడం వెనక ఉన్న ఆర్థిక మార్గాలను కూపీ లాగుతున్నారు. ఇందులో ఇంకా ఎవరి ఎవరి పాత్ర ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.