గింజలు, విత్తనాలు కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, అవి పోషకాల గనులు. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, కండరాలు బలంగా మారాలన్నా ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ మనకు రోజంతా శక్తిని ఇస్తుంది, ఆకలిని కంట్రోల్ చేస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఒక సాధారణ గుడ్డులో సుమారు 6 నుండి 7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అయితే, డైటీషియన్ల ప్రకారం ఈ మూడు రకాల విత్తనాలు, గింజల్లో అంతకంటే ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది.
1. జనప గింజలు (Hemp Seeds): కేవలం 3 టేబుల్ స్పూన్ల ఈ గింజలు దాదాపు 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో శరీరానికి కావలసిన అన్ని రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. వీటిలో గుండెకు మేలు చేసే 'ఒమేగా-3' కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని ఓట్స్, పెరుగు లేదా పండ్ల ముక్కలపై చల్లుకుని హాయిగా తినేయొచ్చు.
2. గుమ్మడికాయ గింజలు (Pumpkin Seeds): ఒక చిన్న కప్పు (సుమారు 28 గ్రాములు) గింజల్లో 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిలో మెగ్నీషియం, జింక్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రాత్రిపూట మంచి నిద్ర పట్టడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడతాయి. వీటిని విడిగా స్నాక్స్‌లా తినొచ్చు లేదా సలాడ్స్, సూప్‌లలో వేసుకోవచ్చు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇవి మంచి హెల్తీ స్నాక్.
3. వేరుశెనగ (Peanuts): పావు కప్పు వేరుశెనగ గింజల్లో సుమారు 11 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వేరుశెనగలు మన గుండెకు చాలా మంచివి. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇంకా శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వేరుశెనగలు తింటే శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు కూడా అందుతాయి.
కేవలం గుడ్ల మీద మాత్రమే ఆధారపడకుండా, ఈ గింజలను(seeds) మీ ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్ పొందవచ్చు.
