ఇండియాలో గ్యాస్ షార్టేజ్ లేదు.. భయపడొద్దు: పెట్రోలియం శాఖ ప్రకటన

ఇండియాలో గ్యాస్ షార్టేజ్ లేదు.. భయపడొద్దు: పెట్రోలియం శాఖ ప్రకటన

ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం కారణంగా ఇండియాలో గ్యాస్ తో పాటు పెట్రోల్, డీజిల్ షార్టేజీపై ఆందోళన నెలకొంది. దీనికి తోడు గ్యాస్ ప్రి బుకింగ్ టైమ్ ను 45 రోజులకు పెంచడంతో వినియోగదారులు ఏజెన్సీల ముందు క్యూ కడుతున్నారు. మరోవైపు హోటల్స్, హాస్టల్స్ లో మెనూ మార్చడం కూడా మరింత కంగారుకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఇండియాలో ఇంధన నిల్వలకు కొదవ లేదని.. ప్రజలు భయపడాల్సిన పనిలేదని పెట్రోలియం శాఖ శుక్రవారం (మార్చి 13) ప్రకటించింది. 

ఇంధన కొరతపై పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ సుజాత శర్మ మీడియాతో మాట్లాడారు. ఇంధన కొరతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. రెగ్యులర్ కోటాకు మించి రాష్ట్రాలకు 48 వేల కిలో లీటర్ల కిరోసిన్ అదనంగా విడుదల చేసినట్లుగా చెప్పారు. ఈ పరిస్థితుల్లో చిన్న, మధ్యతరహా వినియోగదారులకు బొగ్గు సరఫరా చేయాల్సిందిగా కోల్ ఇండియాను ఆదేశించినట్లు తెలిపారు. 

దేశంలో గృహావసరాలకు వినియోగించే ఎల్పీజే సప్లై లో ఎలాంటి అతరాయం లేదన్నారు. ముఖ్యంగా హాస్పిటల్స్, విద్యా సంస్థలకు మొదటి ప్రాధాన్యతతో డెలివరీ చేస్తున్నట్లు చెప్పారు. మార్చి 5 తో పోల్చితే ఎల్పీజీ సరఫరా 30 శాతానికి పెంచినట్లు చెప్పారు. అయితే కమర్షియల్ సిలిండర్లు మాత్రం ప్రాధాన్యతల ఆధారంగా పంచేందుకు రాష్ట్రాలకే అప్పగించినట్లు పేర్కొన్నారు. 

ఇక పెట్రోల్ డీజిల్ సరిపడినంత స్టాక్ నిల్వ ఉందన్నారు. రిఫైనరీలు ఫుల్ కెపాసిటీతో ఆపరేట్ చేస్తున్నట్లు చెప్పారు. సీఎన్జీ, పీఎన్జీ సప్లైలో ఎలాంటి అంతరాయం లేదన్నారు. కమర్షియల్ వినియోగదారులు ఎల్పీజీ షార్టేజ్ ఎందుర్కొంటుంటే లోకల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ నుంచి పీఎన్జీ కనెక్షన్లు పొందాలని సూచించారు.