గ్రేటర్ హైదరాబాద్ వాసులకు మరో అర్బన్ ఫారెస్ట్ అందుబాటులోకి రానుంది. ఆమన్గల్ డివిజన్ లోని గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్ గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నో ఏళ్లుగా న్యాయ వివాదాల్లో చిక్కుకున్న గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వం ఎట్టకేలకు రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటిస్తూ శుక్రవారం (మార్చి 13) ఉత్తర్వులు జారీ చేసింది.
గుర్రంగూడలో మొత్తం 424 ఎకరాలు 31 గుంటల విస్తీర్ణంలో ఉన్న అటవీ భూభాగాన్ని రిజర్వ్ ఫారెస్టుగా మారుస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. తెలంగాణ ఫారెస్ట్ చట్టం–1967లోని సెక్షన్ 15 ప్రకారం రిజర్వ్ ఫారెస్ట్‌గా గుర్తిస్తూ పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ G.O.Ms.No.7 (తేదీ: 09-03-2026) ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ప్రాంతానికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ పూర్తై, అటవీ భూములకు అధికారికంగా రిజర్వ్ ఫారెస్ట్ హోదా లభించిందని అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారి డాక్టర్ సీ. సువర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయంతో ఆ అటవీ భూములకు మరింత బలమైన చట్టపరమైన రక్షణ లభించనుందన్నారు.
ఈ విస్తీర్ణంలో భాగమైన సాహెబ్‌నగర్ కలాన్ గ్రామంలోని సర్వే నంబర్ 201/1లోని 102 ఎకరాలు చాలా కాలంగా న్యాయ వివాదంలో ఉన్నాయని చెప్పారు. సాహెబ్‌నగర్ కలాన్ కేసుగా ప్రసిద్ధి చెందిన ఈ వ్యవహారం చాలా కాలం పాటు వివిధ న్యాయస్థానాల్లో విచారణ జరిగింది. అటవీ అధికారుల కృషి, ప్రభుత్వ మద్దతువలన చివరకు అటవీ శాఖ వాదనను సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ తీర్పులో అటవీ భూముల ఆక్రమణలు, అనధికార హక్కుల నుంచి కాపాడాల్సిన అవసరాన్ని సుప్రీం కోర్టు పునరుద్ఘాటించిందని ఆమె తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని భారీ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించిందని డా.సువర్ణ తెలిపారు. హైదరాబాద్ సిటీలో నగరీకరణ వేగంగా పెరుగుతున్న క్రమంలో పచ్చని ప్రదేశాల అవసరం పెరుగుతుందన్నారు. ఈ పరిస్థితిలో పార్క్ నగర ప్రజలకు ముఖ్యమైన గ్రీన్ స్పేస్‌గా మారనుందన్నారు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు, పర్యావరణంపై అవగాహన పెంపొందించేందుకు, కుటుంబాలతో కలిసి విశ్రాంతి తీసుకునేందుకు ప్రజలకు అనువైన ప్రదేశంగా దీనిని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం అటవీ భూముల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఆక్రమణలను అరికట్టడంలో కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. అదే సమయంలో హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులు, గ్రీన్ లంగ్ స్పేస్‌లను విస్తరించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. గుర్రం గూడ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించడం కూడా ఆ దిశలో తీసుకున్న కీలక నిర్ణయంగా పేర్కొన్నారు.
