సినిమా టికెట్ ధర పెంపు వివాదంలో తెలుగు సినీ ఇండస్ట్రీకి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఇటీవల తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంత ఉత్తర్వులపై స్టే విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా విడుదల కావడానికి 90 రోజుల ముందే ధరల పెంపుపై ప్రభుత్వం మెమో జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నిబంధన వల్ల మేకర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సుప్రీంకోర్టులో మైత్రీ మూవీస్ విజయం
శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. 90 రోజుల నిబంధన ఆచరణాత్మకంగా ఇబ్బందులతో కూడుకున్నదని భావిస్తూ, ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే కొనసాగవచ్చని స్పష్టం చేసింది. అంటే విడుదలకు కొద్దిరోజుల ముందు అనుమతి తీసుకునే విధానానికి అనుమతి ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పుతో టాలీవుడ్ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వివాదం ఏమిటంటే?
సంక్రాంతి సినిమాల సమయంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతినిస్తూ మెమో జారీ చేసింది. దీనిపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, గత ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా 'మన శంకరవరప్రసాద్ గారు' , 'రాజాసాబ్' వంటి చిత్రాలకు ఒకే రోజు అనుమతులు ఇవ్వడంపై న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ క్రమంలోనే 90 రోజుల ముందస్తు నోటీసు నిబంధనను తెరపైకి తెచ్చింది. అయితే, సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ఆ నిబంధన తాత్కాలికంగా పక్కకు పోయింది.
ALSO READ : నోరుజారాను.. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయను..
'ఉస్తాద్' కు కలిసొచ్చిన కాలం!
సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ స్టే ఆర్డర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రానికి పెద్ద వరంగా మారింది. మార్చి 19న ఉగాదికి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు ప్రీమియర్ షోలు, అలాగే రెగ్యులర్ షోలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఇప్పుడు మార్గం సుగమమైంది. కేవలం ఈ సినిమాకే కాకుండా, వేసవి బరిలో ఉన్న ఇతర భారీ చిత్రాలకు కూడా ఈ తీర్పు ఊపిరి పోసింది.
నిర్మాతల వాదన ఏమిటి?
సినిమా నిర్మాణం అనేది కొన్ని వందల కోట్ల రూపాయల పెట్టుబడితో కూడుకున్న వ్యవహారం. సినిమా విడుదల సమయానికి ఉండే క్రేజ్, థియేటర్ల లభ్యత ఆధారంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 90 రోజుల ముందే అంచనా వేయడం సాధ్యం కాదని నిర్మాతలు వాదించారు. సుప్రీంకోర్టు ఈ వాదనతో ఏకీభవించి, స్టే ఇవ్వడం ద్వారా చిత్ర పరిశ్రమకు పెద్ద ఊరటనిచ్చింది. మొత్తానికి, న్యాయపోరాటంలో టాలీవుడ్ గెలిచింది. ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. .
