- హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
రామచంద్రాపురం, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలోని రామచంద్రాపురం రాయసముద్రం చెరువును సుందరీకరిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈ విషయమై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని పేర్కొన్నారు. మంగళవారం రాయసముద్రం చెరువును, అలుగులు, ఇన్లెట్, ఔట్లెట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. బీహెచ్ఈఎల్ ఏజీఎం సురన్ప్రసాద్, హెచ్ఎండీఏ, సంబంధిత శాఖల అధికారులతో అక్కడే మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం మాట్లాడుతూ.. రెవెన్యూ పరంగా చెరువు బీహెచ్ఈఎల్ పరిధిలో ఉన్నా కమ్యూనల్ ప్రాపర్టీగా పరిగణించాలన్నారు. ప్రజల వినియోగానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసి హెచ్ఎండీఏకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
చెరువులోకి వస్తున్న మురుగు నీటిని దారి మళ్లించేందుకు బీహెచ్ఈఎల్తో చర్చలు జరిపి ప్రత్యేక పైప్ లైన్లు వేస్తామన్నారు. వలస పక్షులకు కూడా నిలయంగా మారిన ఈ చెరువును పూర్తి స్థాయిలో కాపాడుకోవాలని కోరారు. తెల్లాపూర్ మేళ్ల చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో మట్టిని నింపిన ఫిర్యాదుపై స్పందించిన రంగనాథ్ వెంటనే అక్కడ మట్టిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. రాజు యాదవ్ అనే వ్యక్తి ఇప్పటికైనా స్పందించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
