తాను విద్యాశాఖ మంత్రిని అయితే కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు బంద్ చేయడం ఖాయమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. విద్య వ్యాపారం కాదన్న ఆయన... కార్పొరేట్ విద్యా సంస్థలు పేదలను దోచుకుంటున్నాయని ఆరోపించారు.
నల్గొండ జిల్లాలో ప్రతీక్ ఫౌండేషన్ నిర్మించిన బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్ లు, లైబ్రరీ, ఆడిటోరియం, ఇండోర్ స్టేడియం లతో 8 కోట్ల నిర్మాణ వ్యయంతో 3 అంతస్తుల్లో ఈ స్కూల్ ను నిర్మించారు. ప్రతీక్ ఫౌండేషన్ నిర్మించిన ప్రభుత్వ స్కూల్ ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తాను నీతి నిజాయితీతో బతికినానని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆరోగ్యం సహకరిస్తే వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నుండే పోటీచేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయం తీసుకుందన్నారు. అభివృద్ధి కోసం తాను ఏది అడిగినా సీఎం కాదనరని చెప్పారు. నల్లగొండ మున్సిపాలిటీనీ అభివృద్ధి చేసేందుకే కార్పొరేషన్ గా మార్చామని అన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి నల్లగొండ కార్పొరేషన్ ను అభివృద్ధి చేస్తానని చెప్పారు. నల్లగొండ పట్టణంలో మరో ఆరు నెలల్లో 24 గంటలు తాగు నీరు అందిస్తానని చెప్పారు. కొడంగల్ కు ఎన్ని నిధులు ఇస్తే తన నియోజకవర్గానికి అన్ని నిధులు ఇవ్వాలని సీఎం ను కోరినట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
