తల్లులు, శిశువుల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

తల్లులు, శిశువుల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం : ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకున్న తల్లులతో పాటు వారి శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం తనవంతు సహకరిస్తానని ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నగరంలోని అల్మాస్  ఫంక్షన్  హాల్ లో మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకున్న తల్లులకు యెన్నెం హెల్త్  కార్డ్ లను పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి సమగ్ర వైద్యం అందించడం సామాజిక బాధ్యతగా భావిస్తూ యెన్నం హెల్త్  కిట్ ను అందిస్తున్నామని తెలిపారు. తల్లులు, శిశువుల ఆరోగ్య సంరక్షణను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఐఎంఏ డాక్టర్లతో చర్చించి హెల్త్​ కార్డులను అందిస్తున్నట్లు చెప్పారు. 

ఏడాది పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవమైన తల్లులు, వారి శిశువులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్డుతో ఏడాది ప్రైవేట్​ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు ప్రైవేట్​ హాస్పిటల్  డాక్టర్లు ముందుకురావడం అభినందనీయమని తెలిపారు. ప్రైవేట్​ హాస్పిటల్  డాక్టర్లు, హాస్పిటల్  డెవలప్​మెంట్  కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేందర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్  ఖాద్రి పాల్గొన్నారు.