- సౌలత్లు కల్పించకుండానే ఇండ్ల పంపిణీ
- అస్తవ్యస్తంగా విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థ
- అసంపూర్తి పనులతో అవస్థలు.. పట్టించుకోని అధికారులు
- మహబూబ్‌నగర్ జిల్లా మాచన్‌పల్లి లబ్ధిదారుల కష్టాలు
మహబూబ్‌నగర్/మహబూబ్‌నగర్ రూరల్, వెలుగు : కనీస సౌకర్యాలు కల్పించకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయడంతో అక్కడ నివాసముంటున్న కుటుంబాలు అష్టకష్టాలు పడుతున్నాయి. మహబూబ్‌నగర్ రూరల్ మండలం మాచన్‌పల్లి గ్రామానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరయ్యాయి. మొత్తం ఎనిమిది బ్లాకుల్లో జీ ప్లస్ వన్ బిల్డింగులు నిర్మించారు.
ఒక్కో బిల్డింగులో నాలుగు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల చొప్పున మొత్తం 32 ఇండ్లను నిర్మించారు. 2023లో వీటిని లబ్ధిదారులకు అలాట్ చేయాల్సి ఉండగా, అర్హులను గుర్తించడంలో ఆలస్యం చేయడం, అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పంపిణీ వాయిదా పడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత దీపావళి పండుగకు ముందు 32 మంది లబ్ధిదారులకు గుర్తించి, వారికి ఇండ్లను అలాట్ చేసింది.
ప్రస్తుతం ఈ 32 కుటుంబాలు అక్కడే నివాసం ఉంటున్నాయి. అయితే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించినా కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో వసతులు కల్పించకోవడంతో ప్రస్తుతం అక్కడ నివాసం ఉంటున్న వారికి తిప్పలు తప్పడం లేదు.
సమస్యలు ఇవీ..
- డబుల్ బెడ్ రూమ్ ఇండ్లల్లో అటాచ్డ్ బాత్ రూమ్, లెట్రిన్లను నిర్మించారు. కుళాయిలు కూడా ఫిట్ చేశారు. కానీ నీటి వసతి కల్పించలేదు. దీంతో అటాచ్డ్ బాత్ రూమ్స్‌ను కొందరు స్నానాలకు, మరికొందరు సామాన్లు భద్రపర్చుకునేందుకు వినియోగిస్తున్నారు. ఇక బహిర్భూమికి మహిళలు, పురుషులు సమీపంలో ఉండే వ్యవసాయ పొలాల్లోకే వెళ్తున్నారు.
- ఈ 32 కుటుంబాలకు తాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన నీటి సంప్ ఖాళీగా ఉంది. ఇందులోకి నీటిని నింపే పైపులైన్ కనెక్షన్లు లేవు. ప్రతీ ఇంటికి నీటిని అందించేందుకు మిద్దెలపై వెయ్యి లీటర్ల కెపాసిటీ ఉన్న వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశారు. కానీ అవి నిరుపయోగంగానే మారాయి. అవి ఎండుకు ఎండి, వానకు నాని కొన్ని పగిలిపోయాయి.
- 32 కుటుంబాలకు ఒక్కటే మిషన్ భగీరథ కనెక్షన్ ఉంది. తాగేందుకు నీటిని అందరూ అక్కడికే వచ్చి పట్టుకోవాల్సిందే.
- సెప్టిక్ ట్యాంక్ కోసం తవ్వకాలు చేపట్టి వదిలేశారు. రానున్నది వర్షాకాలం కావడంతో అందులోకి నీరు చేరితే ప్రమాదంగా మారే అవకాశం ఉంది. డ్రైనేజీ కనెక్షన్లు సరిగా లేవు. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం డ్రైనేజీ నీరు లీకవుతోంది. చిన్న పిల్లలు అక్కడే బాత్ రూమ్‌లకు వెళ్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా కంపుకొడుతోంది. మురుగు నిల్వ ఉంటుండడంతో దోమలు పెరుగుతున్నాయి.
- ఇండ్లకు ప్రత్యేక ట్రాన్స్ఫారం ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు.. కానీ ఇప్పటి వరకు ఏర్పాటు చేయడం లేదు. సమీపంలోని కరెంటు పోల్ నుంచి ఒక సర్వీస్ వైర్ నుంచి 32 ఇండ్లకు కనెక్షన్ తీసుకున్నారు. ఇక్కడ వైర్లు బయటే ఉండడంతో షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది. ఇండ్ల వద్ద ఉన్ హైమాస్ట్ లైట్లు వెలగడం లేదు. స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయలేదు. తరచూ పాములు వస్తున్నాయి. ఇటీవల స్థానికులే అక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగించారు.
