జడ్చర్ల, వెలుగు : పొట్టకూటి కోసమని ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి, ఇక్కడి రైతుల ట్రాక్టర్లను దొంగిలిస్తున్న ఇద్దరు నిందితులను శుక్రవారం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల వివరాలను మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు. ఏపీలోని పల్నాడు జిల్లా రంపచర్ల మండలానికి చెందిన నందిగాం పాపారావు(33), చంద్రశేఖర్ రావు(32) అనే స్నేహితులు ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. గతేడాది మిడ్జిల్ మండలం కొత్తూరు గ్రామంలో వడ్ల కట్టలు కట్టే పనికి వచ్చిన పాపారావు, పొలాల్లో రాత్రి పూట ట్రాక్టర్లు ఉండడాన్ని గమనించి దొంగతనానికి పథకం వేశాడు.
ఈ క్రమంలో ఈనెల 17న కొత్తూరుకు చెందిన శ్రీను ట్రాక్టర్ ను, 25న మిడ్జిల్ కు చెందిన రాములు ట్రాక్టర్ ను తన స్నేహితుడితో కలిసి గుట్టుచప్పుడు కాకుండా పల్నాడుకు తరలించాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి, రంపచర్లలో ఉన్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో చొరవ చూపిన మిడ్జిల్ ఎస్సై శివ నాగేశ్వర నాయుడుని ఉన్నతాధికారులు అభినందించారు. సమావేశంలో జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్, మిడ్జిల్ ఎస్సై శివ నాగేశ్వర నాయుడు ఉన్నారు.
