పాట్నా: వక్ఫ్ (సవరణ) చట్టంపై మహాఘటబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే వక్ఫ్ చట్టాన్ని చెత్తబుట్టలో పడేస్తామని హాట్ కామెంట్ చేశారు. ఈ చట్టం ముస్లిం హక్కులను కాలరాస్తోందని ఆయన ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం (అక్టోబర్ 26) ముస్లింలు అధికంగా నివసించే కతిహార్ జిల్లాలో క్యాంపెయినింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా తేజస్వీ మాట్లాడుతూ.. సీఎం నితీష్ కుమార్ మాదిరిగా తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ మతతత్వ శక్తులతో ఎప్పుడూ రాజీపడలేదని అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), దాని అనుబంధ సంస్థలు బీహార్‌తో పాటు దేశంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బీహార్‌లో మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మతతత్వ అజెండాలు తీవ్రమవుతాయని అన్నారు.
బీజేపీని భారత్ జలావ్ పార్టీగా అభివర్ణించారు తేజస్వీ. నితీష్ కుమార్ 20 ఏళ్ల పాలనలో బీహార్‌లో అవినీతి విచ్చలవిడిగి పెరిగిందని.. శాంతిభద్రతలు పూర్తి విఫలమయ్యాయని ఆరోపించారు. సీమాంచల్ ప్రాంతాన్ని నితీష్ కుమార్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. మహాఘటబంధన్ గెలిస్తే సీమాంచల్ అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేస్తామని తేజస్వీ హామీ ఇచ్చారు.
బీహార్‌లో ఇండియా కూటమి గెలిస్తే వృద్ధాప్య పెన్షన్‌ను నెలకు రూ.2 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కాగా, బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు 2025, నవంబర్ 6న తొలి దశ, 11న రెండో దశ పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న కౌంటింగ్ అదే రోజు ఫలితాలు విడుదల కానున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ ఇప్పటికే ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి చేసింది. నామినేషన్ల పర్వం ముగియడంతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.
