న్యూఢిల్లీ: కార్ల తయారీ కంపెనీలు మరోసారి ధరలు పెంచడానికి రెడీ అవుతున్నాయి. రా మెటీరియల్స్ ఖర్చులు పెరగడంతో ఈ ఏడాది జనవరిలో ధరలు పెంచగా, రెండో రౌండ్ పెంపును వచ్చే నెల నుంచి చేపడుతున్నాయి.
మెర్సిడెస్- బెంజ్ ఈ ఏడాది జనవరిలో సుమారు 2శాతం ధరలు పెంచింది. తాజాగా మరో 2 శాతం పెంచాలని నిర్ణయించింది. ఆడి కూడా జనవరి తర్వాత మరోసారి రేట్లు పెంపునకు సిద్ధమయ్యింది. ఏప్రిల్ నుంచి 2 శాతం ధరలు పెంచనుంది.
నిస్సాన్, ఎంజీ మోటార్, బీవైడీ, హోండా, రెనాల్ట్ వంటి బ్రాండ్లు కూడా జనవరిలో ధరలు పెంచాయి. మారుతి సుజుకి, మహీంద్రా జనవరిలో ధరలు పెంచలేదు. జీఎస్‌టీ 2.0 తర్వాత డిమాండ్ పెరుగుతుండటంతో ధరలను స్థిరంగా ఉంచాయి.
టాటా మోటార్స్ ప్యాసింజర్ బండ్ల ధరలను జనవరిలో 3శాతం వరకు పెంచగా, హ్యుందాయ్ కూడా అప్పుడు ధరలు పెంచింది. ఏప్రిల్ నుంచి పెంచడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. టాటా మోటార్స్ కమర్షియల్ వాహనాల ధరలను మాత్రం వచ్చే నెల నుంచి 1.5 శాతం వరకు పెంచనుంది.
