రాజుపాలెం సోలార్ ప్లాంట్ రెడీ..గ్రిడ్‌‌తో అనుసంధానానికి ఏర్పాట్లు 

రాజుపాలెం సోలార్ ప్లాంట్ రెడీ..గ్రిడ్‌‌తో అనుసంధానానికి ఏర్పాట్లు 
  • మరో నెల రోజుల్లో పూర్తి కానున్న చిన్న కోరుకొండి ప్రాజెక్ట్‌‌
  • మోడల్‌‌ సోలార్‌‌ విలేజ్‌‌ కింద బోనకల్‌‌లో కొనసాగుతున్న పనులు
  • మూడు నెలల్లో అందుబాటులోకి 138.45 మెగావాట్ల సోలార్‌‌ విద్యుత్‌‌

ఖమ్మం, వెలుగు : మహిళా సంఘాల ‘సోలార్‌‌ కల’ సాకారం కాబోతోంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల తరఫున ప్రతి జిల్లాలో రెండు మెగావాట్ల సోలార్‌‌ విద్యుత్‌‌ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం రాజుపాలెం, కల్లూరు మండలం చిన్నకోరుకొండిలోని ప్రభుత్వ భూముల్లో ఒక మెగావాట్‌‌ చొప్పున సోలార్‌‌ విద్యుత్‌‌ ఉత్పత్తి ప్లాంట్‌‌ నిర్మాణానికి గతేడాదే ప్లాన్‌‌ చేశారు.

ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గమైన మధిరలోని రాజుపాలెంలో నాలుగు ఎకరాల్లో చేపట్టిన సోలార్‌‌ పవర్‌‌ ప్లాంట్‌‌ నిర్మాణం పూర్తి చేసుకొని గ్రిడ్‌‌తో అనుసంధానానికి రెడీగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు కేటాయించిన సోలార్‌‌ పవర్‌‌ ప్లాంట్లలో నిర్మాణం పూర్తి చేసుకున్న ప్లాంట్‌‌ ఇదే కావడం గమనార్హం. మరో వైపు చిన్న కోరుకొండిలో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్‌‌ పనులు మరో నెల రోజుల్లో పూర్తి అవుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు. 

నెలకు 1.20 లక్షల యూనిట్ల ఉత్పత్తి

సోలార్‌‌ పవర్‌‌ ప్లాంట్‌‌ ఏర్పాటు కోసం మహిళా సంఘాలకు ప్రభుత్వమే ఉచితంగా భూమిని కేటాయించగా, ప్లాంట్‌‌ నిర్మాణానికి అవసరమైన నిధులు రూ.3 కోట్లను బ్యాంక్‌‌ రుణంగా అందించారు. రాజుపాలెంలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌‌ ద్వారా నెలకు 1.20 లక్షల యూనిట్ల విద్యుత్‌‌ ఉత్పత్తి కానుంది. ఈ సోలార్‌‌ ప్లాంట్‌‌ను వెంకటాపురం సబ్‌‌ స్టేషన్‌‌ ద్వారా గ్రిడ్‌‌కు అనుసంధానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విద్యుత్‌‌ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత వచ్చే ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని ప్రతి నెల బ్యాంకు కిస్తీ కింద 12 ఏండ్ల పాటు జమ చేస్తారు. 13వ ఏడాది నుంచి సంవత్సరానికి రూ.45 లక్షల చొప్పున ఆదాయం మహిళా సంఘాలకు సమకూరుతుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సోలార్‌‌ ప్లాంట్‌‌ మెయింటెనెన్స్‌‌ కోసం మహిళలతో పాటు వారి పిల్లల్లో ఐటీఐ చదివి అర్హులైన వారిని గుర్తించి వారికి ఏడాది పాటు ట్రైనింగ్‌‌ ఇవ్వనున్నారు.

కొనసాగుతున్న మోడల్‌‌ సోలార్‌‌ విలేజ్‌‌ పనులు

మోడల్ సోలార్ విలేజ్ పథకం కింద పైలట్‌‌ ప్రాజెక్ట్‌‌ కింద ఖమ్మం జిల్లాలో బోనకల్ మండలాన్ని ఎంపిక చేశారు. మండలంలోని మొత్తం 27 గ్రామాల్లో 16,387 ఇండ్ల విద్యుత్‌‌ సర్వీసులకుగాను 2 కిలోవాట్ల చొప్పున 33.67 మెగావాట్ల ఆన్‌‌ గ్రిడ్‌‌ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఉచితంగా అందిస్తున్నారు. వీటితో పాటు వ్యవసాయ కనెక్షన్లు 4,371 సర్వీసులు కాగా.. 7.5 కిలోవాట్ల చొప్పున 32.78 మెగావాట్ల గ్రౌండ్‌‌ -మౌంటెడ్ ఆన్‌‌ గ్రిడ్ సోలార్ ప్లాంట్‌‌ను సైతం ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు ఇంటి కనెక్షన్లకు సంబంధించి 2,619 సర్వీస్‌‌లకు రెండు కిలోవాట్ల చొప్పున 5.2 మెగావాట్ల ప్లాంట్లు అమర్చగా మిగతా పనులు కొనసాగుతున్నాయి.

ఇవి కాకుండా పీఎం కుసుమ్‌‌ పథకం కింద ఖమ్మం జిల్లాలో 43 మంది రైతులు 70 మెగావాట్లకు పవర్ పర్చేజ్‌‌ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇందులో భాగంగా తిరుమలాయపాలెం మండలం జూపెడలో గత వారం రెండు మెగావాట్ల సోలార్‌‌ పవర్ ప్లాంట్‌‌ను గ్రిడ్‌‌తో అనుసంధానం చేశారు. మిగిలిన అన్ని సోలార్‌‌ ప్లాంట్లు రెండు నుంచి మూడు నెలల్లో గ్రిడ్‌‌తో అనుసంధానం అవుతాయని అధికారులు చెబుతున్నారు. అన్ని ప్లాంట్ల నిర్మాణం పూర్తి అయితే ఖమ్మం జిల్లాలో 138.45  మెగావాట్ల సోలార్‌‌ పవర్‌‌ అందుబాటులోకి రానుంది.