- రాహుల్ మాట ఇప్పటికీ ఎందుకు అమలవ్వడం లేదు: కేటీఆర్
- గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి నివాళి
- నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీగా అసెంబ్లీ సమావేశాలకు
హైదరాబాద్, వెలుగు: వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని, మొదటి కేబినెట్లోనే వాటికి చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పినా ఇప్పటికీ అమలు కావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి గవర్నర్ ప్రసంగంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారని, సీఎం కూడా సంతకం పెట్టారని గుర్తు చేశారు.
కానీ, ఆరు గ్యారంటీలకు ఈ ప్రభుత్వం మంగళం పాడినట్టే కనిపిస్తున్నదన్నారు. కేసీఆర్ హయాంలో పంటలు నాట్లు వేసేటప్పుడే రైతుబంధు పడేదని, కానీ, ఇప్పుడు పంటలు కోతకు వచ్చినా దిక్కు లేదని ఫైర్ అయ్యారు. రాహుల్‌కు రూ.వెయ్యికోట్లు పంపిస్తూ.. రైతులకు వెన్నుపోట్లు పొడుస్తారా అని ప్రశ్నించారు. రాహుల్ బంధు కాదు.. రైతు బంధు వేయాలని డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అమరుల స్థూపానికి నివాళులర్పించారు.
నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘‘అన్ని వర్గాలకు హామీలిచ్చి మోసం చేసిన ప్రభుత్వం ఇది. బలహీన వర్గాలకు లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు ఐదేళ్లలో.. మరి రెండు బడ్జెట్లు అయిపోయినవి, ఇది మూడో బడ్జెట్. ఈపాటికే 60 వేల కోట్లు పెట్టి ఉండాలి, మరి ఇంతవరకు దానిమీద కూడా స్పష్టత లేదు. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు దళితబంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం ప్రవేశపెడతామన్నారు. రూ.12 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పటివరకూ అతీగతి లేదు. రెండు లక్షల ఉద్యోగాల ఊసే లేదు” అని ఆయన విమర్శించారు.
మహిళలకు రూ.2,500 ఏవి?
నెలకు రూ.2,500 కోసం మహిళలు ఎదురు చూస్తున్నారని, ఎప్పటి నుంచి ఇస్తారో ప్రభుత్వం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రూ.4 వేల పింఛన్ కోసం వృద్ధులు, రైతు భరోసా కోసం రైతులు, రూ.వెయ్యి కోసం ఆటోవాలాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారన్నారు. ఈ అన్ని విషయాల్లో తప్పకుండా ప్రభుత్వాన్ని శాసనసభ సమావేశాల్లో నిలదీస్తామని చెప్పారు. డబ్బులు ఎక్కడికిపోతున్నాయని ప్రశ్నించారు.
