ఎమ్మెల్యే మందుల సామేల్‌‌ ఇంటిపై బీజేపీ లీడర్ల దాడి

ఎమ్మెల్యే మందుల సామేల్‌‌ ఇంటిపై బీజేపీ లీడర్ల దాడి

మేడిపల్లి, వెలుగు : తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌‌ హిందువులను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ.. బీజేపీ, బీజేవైఎం లీడర్లు సోమవారం బోడుప్పల్‌‌లోని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఆందోళనకు దిగి, కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. అనంతరం బీజేవైఎం మేడ్చల్‌‌ జిల్లా అధ్యక్షుడు బండారు పవన్‌‌రెడ్డి మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ఆలయాల వద్దకు వచ్చి హిందూ ఓటర్ల ఆశీర్వాదాలు కోరిన ఎమ్మెల్యే, ఇప్పుడు అదే హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదన్నారు.

ఎమ్మెల్యే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న మేడిపల్లి పోలీసులు ఎమ్మెల్యే ఇంటి  వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్న బీజేపీ, బీజేవైఎం నాయకులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌‌కు తరలించారు. కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్‌‌ ఇన్‌‌చార్జి ఏనుగు సుదర్శన్‌‌రెడ్డి, జైపాల్‌‌రెడ్డి పాల్గొన్నారు.