కొమురవెల్లిలో భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాలు..ముగిసిన మల్లన్న బ్రహ్మోత్సవాలు

కొమురవెల్లిలో భక్తిశ్రద్ధలతో అగ్నిగుండాలు..ముగిసిన మల్లన్న బ్రహ్మోత్సవాలు

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన అగ్నిగుండాల కార్యక్రమాన్ని సోమవారం తెల్లవారుజామున భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వీరశైవ ఆగమ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు.. ఆదివారం రాత్రి 11.45 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించి, సోమవారం తెల్లవారుజాము వరకు నిర్వహించారు. ముందుగా తోటబావి వద్ద అగ్నిగుండాల కోసం అర్చకులు గణపతిపూజ, వీరభద్రపళ్లేరం, వీరభద్ర ఖడ్గం, దుర్గామాత (భద్రకాళీ)కు పూజలు చేసిన అనంతరం భూమి పూజ, కలుష పూజ చేసి రాత్రి 11.45 గంటలకు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

50 నుంచి 100 క్వింటాళ్ల సమిధలను కాల్చి నిప్పులను తయారు చేశారు. అగ్నిగుండాల కార్యక్రమానికి కర్ణాటకకు చెందిన గురువు శివశంకర శివాచార్య మహాస్వామి హాజరయ్యారు. సోమవారం ఉదయం 5.10 గంటలకు అగ్నిగుండాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత అర్చకులు వీరభద్రుడి పళ్లేరం, ఖడ్గం పట్టుకొని అగ్నిగుండాలని దాటుతూ వెళ్లి గర్భగుడిలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు, శివసత్తులు అగ్నిగుండాలు దాటారు.

ఉదయం 11  గంటలకు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, జంగమార్చన, మహాదాశీర్వదం, మహా మంగళహారతి, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. మల్లికార్జునస్వామి కల్యాణంతో ప్రారంభమైన కొమురవెల్లి బ్రహ్మోత్సవాలు అగ్నిగుండాల కార్యక్రమంతో అధికారికంగా ముగిశాయి. అగ్నిగుండాల కార్యక్రమంలో ఈవో కృష్ణ ప్రసాద్, ఏఈఓలు శ్రీనివాస్, రావుల సుదర్శన్, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌‌రెడ్డి, ఆలయ చైర్మన్‌‌ గంగం నర్సింహారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్, ధర్మకర్తలు పయ్యావుల ప్రవీణ్‌‌ యాదవ్, లింగం పాల్గొన్నారు.