- 10,368 మందికి పరీక్షలు చేస్తే 24 శాతం మందికి రక్తపోటు
- 21 నుంచి 40 ఏండ్ల మధ్య 58.9 శాతం బాధితులు
- ఏఐఎన్‌యూ స్క్రీనింగ్‌లో వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు: తాము ఇప్పటివరకు 10,368 మందికి ఉచిత కిడ్నీ స్క్రీనింగ్ నిర్వహిస్తే అందులో 24.01శాతం మందికి రక్తపోటు ఉన్నట్లు తేలిందని బంజారాహిల్స్ లోని ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ డాక్టర్లు తెలిపారు. వరల్డ్ కిడ్నీ డేను పురస్కరించుకుని మొబైల్ కిడ్నీ స్క్రీనింగ్ నిర్వహిస్తుండగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయన్నారు. తాము నిర్వహించిన పరీక్షల్లో ప్రతి నలుగురిలో ఒకరికి రక్తపోటు ఉన్నట్టు తేలిందన్నారు.
యువతలోనే కిడ్నీ వ్యాధులు ఎక్కువ..
పరీక్షలు నిర్వహించిన వారిలో 66 శాతం పురుషులు, 34 శాతం మహిళలు ఉన్నారని, వీరిలో 21 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్సున్న వారిలో 58.9 శాతం మంది కిడ్నీ వ్యాధుల బారిన పడ్డారన్నారు. యువతలోనే కిడ్నీ డిసీజ్ ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. సాధారణంగా ఈ వయసు వారు కిడ్నీ పరీక్షలు చేయించుకోరని, కానీ ఈ వయసులో ఉన్న వారికి రక్తపోటు, ఊబకాయం, కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నాయన్నారు.
దీర్ఘకాలంగా నియంత్రణలో లేని రక్తపోటు కిడ్నీ రక్తనాళాలను దెబ్బతీసి కిడ్నీ పనితీరును తగ్గిస్తుందన్నారు. తమ స్క్రీనింగ్ తో కొంతమంది ఇప్పటికే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అడ్వాన్సుడ్దశల్లో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఉద్యోగాల్లో ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, అధిక ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవడం, తక్కువ నీరు తాగడం, డయాబెటిస్, రక్తపోటు వంటి కారణాలు కిడ్నీ పనితీరును దెబ్బతీస్తాయన్నారు.
