శంషాబాద్ ఎయిర్ పోర్టు డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ కు అడ్డాగా మారుతోంది. ఈ మధ్య విదేశాల నుంచి భారీగా గంజాయి, డ్రగ్స్ ను భారత్ కు తరలిస్తూ పట్టుబడుతున్నారు. లేటెస్ట్ గా అధికారుల కళ్ళు కప్పి విదేశీ హైడ్రోపోనిక్ గంజాయిని తరలించడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో అక్టోబర్ 26న బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ భారత ప్రయాణికుడిని తనిఖీ చేయగా హైడ్రోపోనిక్ గంజాయి తరలిస్తున్నట్లు డిఆర్ఐ అధికారులు స్కానింగ్ లో కనుగొన్నారు. వెంటనే అప్రమత్తమైన డీఆర్ఐ అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. లగేజ్ ని తనిఖీ చేయగా సపరేట్ గా తయారు చేసిన సూట్ కేసులో 4.5 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి దొరికింది. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 4.5 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రయాణికుడిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసిన డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
