పాల్వంచ, వెలుగు : గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వంపై ఆధారపడకుండా స్వయం కృషితో యువత ఎదగాలని, స్కూల్ లేని చోట మట్టి ఇటుకలతో బడి కట్టుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. ఆదివారం మండలంలోని ఏజెన్సీ గ్రామమైన బండ్రుగొండ పంచాయతీ కోయ గట్టు గొత్తి కోయగుంపును ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ తో కలిసి ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా స్థానిక యువకులతో మాట్లాడుతూ తమ ప్రాంతానికి పాఠశాలను మంజూరు చేశామని, ఆ ప్రాంత విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలంటే పక్కా భవనం అవసరమని, అందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. స్థానిక యువత రోజూ కొంత సమయం వెచ్చించి మట్టి ఇటుకలు తయారు చేసి వారి పాఠశాలను వారే నిర్మించుకునేలా కృషి చేయాలని సూచించారు.
మట్టి ఇటుకల తయారీ గురించి స్వయంగా ఆయనే మట్టి కలిపి వివరించారు. నేలపై కూర్చొని గ్రామస్తులతో మాట్లాడారు. అడవుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని,అటవీ ప్రాంతాల్లో చెట్లు నరకకుండా ఉపాధి హామీ పథకం ద్వారా ప్రత్యామ్నాయ జీవనాధారాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
గ్రామస్తులు చేపలు, కౌజు పిట్టల పెంపకం, వెదురు సాగు లాంటి ఉపాధి మార్గాలను ఎంచుకొని స్థిరమైన ఆదాయం పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ డీవో విజయభాస్కర్ రెడ్డి, ఎంపీ ఓ చెన్న కేశవులు, ఏపీఓ పి.రంగా, ఆర్ఐ ప్రసాద్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాజు, ఎంఈఓ
శ్రీరామ్మూర్తి ,ఈసీ తిరుపతయ్య, గ్రామ కార్యదర్శులు నారాయణ, ప్రవీణ్ కుమార్, శంకర్, రాములు పాల్గొన్నారు.
