- రాజకీయ దురుద్దేశంతోనే అసత్య ప్రచారం: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
హైదరాబాద్, వెలుగు: మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవమని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఆదివారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ నేత పుట్ట మధు రాజకీయ దురుద్దేశంతోనే అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా మంత్రి శ్రీధర్ బాబు, ఆయన కుటుంబం ఏంటో ప్రజలకు బాగా తెలుసు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై ప్రజల్లో అపనమ్మకం సృష్టించడంతోపాటు రాష్ట్రంలో పెట్టుబడులను అడ్డుకోవడానికి కేటీఆర్ స్వీయ దర్శకత్వంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారు” అని మండిపడ్డారు.
శ్రీధర్ బాబును బద్నాం చేయాలన్న కుట్రతోనే బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దొంగల పార్టీలో ఉన్న దొంగలే ‘దొంగా దొంగా’ అని అరుస్తూ, నీతులు వల్లె వేస్తున్నారని విమర్శించారు. తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన వారిపై.. బురద చల్లడం, చిల్లర రాజకీయాలు చేయడం ఇక్కడ తప్ప ఎక్కడా కనిపించదన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్డీ పేరిట నకిలీ లెటర్ హెడ్స్ ను ఎవరో బయట వ్యక్తులు సృష్టించి ఐటీ ప్రాజెక్టులు ఇప్పిస్తామంటూ బాధితుల నుంచి రూ.1.77 కోట్లు వసూలు చేశారన్నారు. ఇందులో మంత్రి శ్రీధర్ బాబు పేషీ, మంత్రి వ్యక్తిగత, ఇతర సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదన్నారు.
