పోటెత్తిన భక్తులు..జనసంద్రంగా మారుతున్న మినీ మేడారం జాతరలు

పోటెత్తిన భక్తులు..జనసంద్రంగా మారుతున్న మినీ మేడారం జాతరలు
  • ముల్కనూర్​లో అమ్మవార్లను దర్శించుకున్న మంత్రి పొన్నం
  • మద్దిమేడారంలో పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే దొంతి

భీమదేవరపల్లి/ మొగుళ్లపల్లి/ నల్లబెల్లి /శాయంపేట(ఆత్మకూర్​), వెలుగు: ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఆయా గ్రామాల్లో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. గురువారం అమ్మవార్లు గద్దెలపైన కొలువుదీరడంతో మొక్కులు చెల్లించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్​జాతరకు మంత్రి పొన్నం ప్రభాకర్​ హాజరయ్యారు.

 అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ములకలపల్లి– మొగుళ్లపల్లి గ్రామాల మధ్య నిర్వహిస్తున్న వనదేవతల జాతరకు భక్తులు భారీగా వచ్చి, మొక్కులు తీర్చుకున్నారు.

 వరంగల్​ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి సమీపంలోని మద్ది మేడారం జాతరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరయ్యారు. అమ్మవార్లకు పట్టు వస్ర్తాలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, ఆయా జాతరల్లో శివసత్తుల పూనకాలు, భక్తుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. 

మద్దిమేడారం గద్దెల సమీపంలో నాగుపాము కనిపించడంతో దేవుడి మహిమగా భావించి భక్తులు పుట్టవద్ద పూజలు చేశారు.  హనుమకొండ జిల్లా ఆత్మకూర్​ మండలం అగ్రంపహాడ్​లో సమ్మక్క సారలమ్మ జాతర రెండోరోజు ఉత్సాహంగా కొనసాగింది. 

సమ్మక్కను పసుపు, కుంకుమలు మేళతాళాలు , డప్పు వాయిద్యాల, శివశక్తుల నృత్యాలతో ఊరేగించి ఎదుర్కోళ్లతో అమ్మవారిని గద్దెనెక్కించారు. ముందుగా ఈస్ట్​జోన్​ డీసీపీ అంకిత్​ కుమార్​ గన్​ఫైర్​ చేసి అమ్మవారిని తీసుకువచ్చారు.  హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి వద్ద జరుగుతున్న సమ్మక్క-సారలమ్మను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దర్శించుకున్నారు.