ములుగు, వెలుగు : చరిత్రలో లేని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుతున్నాయని, ప్రజా ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గాన్ని విస్మరించకుండా అన్ని మతాలను, కులాలను గౌరవించే సంస్కారం, సంస్కృతి కలిగినది కేవలం కాంగ్రెస్ పార్టీయే అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు.
బీజేపీ నేతలు ప్రజల అవసరాలను మరిచి కులమత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం ములుగు గిరిజన భవన్లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో కలెక్టర్ దివాకరతో కలిసి పాల్గొన్న మంత్రి సీతక్క స్థానిక ముస్లింలతో కలిసి విందు ఆరగించారు. అంతకుముందు ముస్లింలకు బహుమతులు పంపిణీ చేసి, అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి, మున్సిపాలిటీ చైర్ పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
