ఇండ్ల స్థలాలు సాధించేవరకు పోరాడుతాం : జి.మధుగౌడ్

ఇండ్ల స్థలాలు సాధించేవరకు పోరాడుతాం : జి.మధుగౌడ్

కొల్లాపూర్, వెలుగు : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు సాధించేవరకు పోరాడుతామని, ఇందులో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి జి.మధుగౌడ్ స్పష్టం చేశారు. ఆదివారం కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట గ్రామంలో పాలమూరు ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర జాతీయ కౌన్సిల్ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మధుగౌడ్ హాజరై మాట్లాడారు. జర్నలిస్టుల హెల్త్ కార్డులకు సంబంధించి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వంతో చర్చలు జరిపామని తెలిపారు. అక్రిడేషన్ కార్డుల జారీ విషయంలో స్పష్టత వచ్చిందని, త్వరలోనే అక్రిడేషన్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇండ్లు సాధించే విషయంలో ఎలాంటి పోరాటాలకైనా జర్నలిస్టులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలో టీయూడబ్ల్యూజే, ఐజేయూ సభ్యత్వాల నమోదులో దూసుకుపోతుందని, ఇదే స్థాయిలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు వేయాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులపై జరిగే దాడులపై ఎవరికి వారి సొంత నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్ర కమిటీ సూచనలు పాటించాలని కోరారు.

 అనంతరం జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎంపికైన గోలి సుదర్శన్ రెడ్డి, కర్ణయ్య కుమార్, మాల్యల బాలస్వామి, ప్రశాంత్, శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాస్​ను ఘనంగా సన్మానించారు. అనంతరం నాగర్ కర్నూలు జిల్లా రెండో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పి.విజయ్ కుమార్ అధ్యక్షత జరిగిన సమావేశంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు తెలిపారు.