హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 20 మంది సజీవ దహనమయ్యారు. శివశింకర్ అనే యువకుడు మద్యం మత్తులో బైక్ డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో కర్నూల్ బస్సు ప్రమాద ఘటనపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ హాట్ కామెంట్స్ చేశారు.
మందు తాగి బండి నడిపేటోళ్లు టెర్రరిస్టులు అని విమర్శించారు. తాగి రోడ్లపై వాహనాలు నడిపే వాళ్ల చర్యలు ఉగ్రవాద చర్యలకు తక్కువేమి కాదన్నారు. 20 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న భయంకరమైన కర్నూలు బస్సు ప్రమాదం నిజంగా యాక్సిడెంట్ కాదని.. ఇది బైకర్ శివశంకర్ తాగి నిర్లక్ష్యంగా, బాధ్యతారహిత్యంగా ప్రవర్తించడం వల్ల జరిగిందని అన్నారు.
బైకర్ నిర్లక్ష్యం సెకన్లలో ఎన్నో కుటుంబాలను విషాదంలోకి నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో మద్యం తాగి వాహనాలు నడపడాన్ని సిటీ పోలీసులు ఏమాత్రం సహించరని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ప్రతి వ్యక్తి చట్టపరంగా శిక్ష ఎదుర్కొవాల్సిందేనన్నారు.
అమాయకుల ప్రాణాలకు ముప్పు కలిగించే వారిపై ఎలాంటి దయ, మినహాయింపులు ఉండవని తేల్చిచెప్పారు. మద్యం తాగి వాహనం నడపటం నేరమని.. ఇది జీవితాలను ఛిన్నాభిన్నం చేసే నేరమని అన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారు ఉగ్రవాదులని తాను చేసిన వ్యాఖ్యలను మరోసారి పునరుద్ఘాటిస్తూ.. అలాంటి వ్యక్తులు జీవితాలను, కుటుంబాలను, భవిష్యత్తును నాశనం చేస్తారని అన్నారు.
