ప్రతి ఒక్కరూ సంపాదనలో కొంత సేవింగ్స్ చేస్తూ, కొంత ఏదైనా సురక్షితమైన లేదా ఎక్కువ రాబడి ఇచ్చే పెట్టుబడుల్లో పెట్టాలని ప్లాన్ చేస్తుంటారు. ఈ విషయంలో పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ గొప్ప పేరు పొందాయి. ఇందులో పిల్లల నుండి యువత, మహిళలు ఇంకా వృద్ధుల వరకు అందరికీ స్కీమ్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన వాటిలో పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(SCSS) ప్రత్యేకమైనది. ఎందుకంటే దీనిలో పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ ద్వారా నెలకు రూ.20 వేల 500 వరకు సంపాదించొచ్చు. అలాగే ఇందులో పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ప్రతినెల ఆదాయం:
పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ స్కీమ్ చాల స్పెషల్ కాబట్టి అత్యంత ప్రజాదరణ పొందిన పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ లో ఒకటిగా నిలిచింది. ఎందుకంటే ఒకేసారి పెట్టుబడి పెట్టడం వల్ల నెల నెల ఆదాయం రూ.20 వేల కంటే ఎక్కువ ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత మీకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా అలాగే ప్రతినెల ఖచ్చితంగా ఆదాయం ఉండేలా చేస్తుంది.
వడ్డీ రేట్లు, పన్ను మినహాయింపులు :
ఈ పోస్టాఫీసు స్కీమ్ డిపాజిట్లపై అద్భుతమైన వడ్డీ రేటును అందిస్తుంది. పెట్టుబడిదారులు ఏడాదికి వడ్డీ రేటు 8.2% పొందుతారు. ఇది మీ పెట్టుబడిపై క్రమం తప్పకుండా నెల నెల ఆదాయాన్ని ఇస్తుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే అనేక బ్యాంకులు అందించే ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేటు కంటే చాలా ఎక్కువ. ఇంకా, ఈ స్కీమ్ పెట్టె పెట్టుబడులపై ప్రభుత్వం సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను ప్రయోజనాలను అందిస్తుంది.
ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా, ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా మీ వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపోచ్చు. వయోపరిమితి గురించి చెప్పాలంటే, 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ తెరవవచ్చు. దీనితో పాటు ప్రభుత్వ పదవుల నుండి VRS తీసుకున్న 55 నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్న వారు లేదా డిఫెన్స్ రంగంలో (ఆర్మీ, వైమానిక దళం, నేవీ ఇతర భద్రతా దళాల నుండి రిటైర్డ్) 50 నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్న వారు కూడా అకౌంట్ తెరవవచ్చు.
ఇంట్లో కూర్చొని 2.46 లక్షల సంపాదన: ఇప్పుడు ఏడాది వడ్డీ ఆదాయం గురించి, ఈ పోస్టాఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ప్రతి నెల ఆదాయం ఎలా పొందొచ్చో చూద్దాం.... ఉదాహరణకు, మీరు 30 లక్షలు ఒకేసారి పెట్టుబడి పెట్టారని అనుకుందాం..... ప్రభుత్వం ఇచ్చే 8.2% వడ్డీ రేటు కింద.... మీ పెట్టుబడికి ఏడాది వడ్డీ 2.46 లక్షలు వస్తుంది. ఈ మొత్తాన్ని ప్రతినెల విభజిస్తే మీకు 20వేల 500 ప్రతినెల ఆదాయం పొందవచ్చు. ఈ పథకం మెచూరిటీ కాలం 5 సంవత్సరాలు.
పోస్టాఫీస్ SCSS పథకం కింద అకౌంట్ కోసం మీ దగ్గరలోని సమీపంలోని ఏదైనా పోస్టాఫీస్ శాఖ వెళ్లి తెరవవచ్చు. అకౌంట్ తెరిచిన తర్వాత ఎప్పుడైనా అకౌంట్ క్లోజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే, దీనికి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి, కానీ అకౌంట్ తెరిచిన ఒక ఏడాదిలోపు మూసివేస్తే, మీ పెట్టుబడి మొత్తంపై ఎటువంటి వడ్డీ రాదు. ఒకవేళ మీరు 1 సంవత్సరం తర్వాత లేదా 2 సంవత్సరాల లోపు మూసివేస్తే వడ్డీ మొత్తంలో 1.5% కట్ అవుతుంది, అదేవిధంగా 2 నుండి 5 సంవత్సరాల మధ్య అకౌంట్ క్లోజ్ చేస్తే వడ్డీ మొత్తంలో 1% కట్ అవుతుంది.
