పిల్లలు ఆడుకుంటున్నర్లే అని వదిలేయకండి.. పాపం ఎంత ఘోరం జరిగిందో చూడండి..!

పిల్లలు ఆడుకుంటున్నర్లే అని వదిలేయకండి.. పాపం ఎంత ఘోరం జరిగిందో చూడండి..!

రామనాథపురం: ప్రాణం వెలకట్టలేనిది. పోతే తిరిగి తీసుకురాలేనిది. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారులు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా మృత్యువు ఆ పాపనో, బాబునో కబళించేస్తే ఆ కన్న తల్లిదండ్రులు కడుపు కోత వర్ణనాతీతం. తమిళనాడులోని రామనాథపురంలో అదే జరిగింది. ఒక మూడేళ్ల పాప ఇంటి ముందు ఆడుకుంటూ ఉంది. ఇంతలో రోడ్డు మీద ఒక ఆటో వెళుతోంది. ఉన్నట్టుండి మూడేళ్ల చిన్నారి ఆటో ముందుకు వెళ్లడంతో డ్రైవర్ బ్రేక్ వేసేలోపే జరగరాని ఘోరం జరిగిపోయింది. ఆటో చక్రం కింద నలిగిన ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణం కోల్పోయింది. రామనాథపురంలోని చిన్న కడై వీధిలో శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించగా ఆ పాప ఆటో కింద ఎలా పడిందో పోలీసులకు తెలిసింది.

ఆ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. క్షణ కాలంలో ఆ ఆటో కింద పడి ఆ చిన్నారి తీవ్ర గాయాలపాలై 24 గంటల వ్యవధిలోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయిన తీరు చూస్తే బాధనిపించక మానదు. ఆటో డ్రైవర్ మహ్మద్ ఇయాజ్ ఆ పాపను గమనించి బ్రేక్ వేసి ఆటో ఆపే లోపే ఉన్నట్టుండి పాప ఆటో కింద పడటం గమనార్హం. అయితే ఆ ఆటో డ్రైవర్ పట్టనట్టు ఏం వెళ్లిపోలేదు. పారిపోయే ప్రయత్నమూ చేయలేదు. 

వెంటనే ఆటోలో నుంచి దిగి వచ్చి వెంటనే ఆ పాపను తానే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శనివారం సాయంత్రం పాప చనిపోయింది. పిల్లలు ఇంటి బయట ఆడుకునేటప్పుడు తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు ఒక కంట కనిపెట్టుకుని ఉండాలని మరీ ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో.. రోడ్డు పక్కన ఉండే ఇళ్లలో ఉండేవాళ్లు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు సూచించారు.