న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. విపక్షాల నిరసనల మధ్యనే ప్రధాని ప్రసంగం సాగింది. ముందు తనను మాట్లాడనివ్వాలంటూ విపక్షాలకు ప్రధాని సూచించారు. తన వయసు దృష్ట్యా ఖర్గే కూర్చుని నిరసన తెలిపితే బాగుంటుందని ప్రధాని మోడీ సలహా ఇచ్చారు. ప్రధాని మోడీ ప్రసంగం కొనసాగిస్తుండగానే విపక్ష ఎంపీలు రాజ్య సభ నుంచి వాకౌట్ చేశారు.
వాకౌట్ చేసిన విపక్షాలపై ప్రధాని మోడీ సెటైర్లు వేశారు. విపక్షాలు అలిసిపోయి సభ నుంచి వెళ్లిపోయాయని ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్ చేసిన తప్పులను సరిదిద్దడానికి చాలా సమయం పట్టిందని.. ప్రస్తుతం దేశం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసుకుపోతుందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. ఏ రకమైన సవాళ్లు ఎదురైనా ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు.
ఎక్స్‌ప్రెస్ వేగంతో సంస్కరణలు అమలవుతున్నాయని, 9 దేశాలతో భారత్ ట్రేడ్ డీల్ కుదుర్చుకుందని ప్రధాని మోడీ గుర్తు చేశారు. గ్లోబల్ సౌత్‌లో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తోందని చెప్పుకొచ్చారు. దేశంలోని రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని, దేశంలో ఉన్న 10 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతుల గురించి కాంగ్రెస్ ఎప్పుడూ ఆలోచించలేదని ప్రధాని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలకు అస్సలు విజన్ లేదని ప్రధాని మోదీ రాజ్యసభ సాక్షిగా విమర్శించారు.
చిన్న రైతుల కోసం పీఎం కిసన్ సమ్మాన్ నిధి యోజన తీసుకొచ్చామని, రైతులకు రూ.4 లక్షల కోట్లు అందించామని తెలిపారు. యూపీఏ పాలనలో బ్యాకింగ్ వ్యవస్థ నాశనమైందని.. యూపీఏ పాలనలో NPAలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. తాము వచ్చాక ధైర్యంగా బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు చేపట్టామని -ప్రధాని మోడీ చెప్పారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులు కష్టాలు పడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం గమనార్హం. బెంగాల్‌లో యువత భవిష్యత్ అంధకారంలో ఉందని, బెంగాల్‌లో చొరబాటుదారులకు మమత టీఎంసీ పార్టీ రక్షణ కల్పించిందని ప్రధాని మోదీ రాజ్యసభ సాక్షిగా తీవ్ర ఆరోపణ చేశారు.
