రాయ్​బరేలీ నుంచి రాహుల్ పోటీ

రాయ్​బరేలీ నుంచి రాహుల్ పోటీ
  • నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత
  • హాజరైన ఖర్గే, సోనియా, ప్రియాంక, రాబర్ట్ వాద్రా
  • వయనాడ్ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ 
  • రాయ్​బరేలీ నియోజకవర్గం కాంగ్రెస్​కు కంచుకోట

రాయ్​బరేలీ/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్​లోని రాయ్​బరేలీ లోక్​సభ స్థానం నుంచి బరిలో దిగారు. ఈమేరకు శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. కేరళలోని వయనాడ్ నుంచి కూడా ఆయన పోటీ చేశారు. ఇక అమేథీ అభ్యర్థిగా కిషోరీ లాల్ శర్మ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో రాయ్​బరేలీ, అమేథీ నుంచి ఎవరిని బరిలోకి దించుతారన్న సస్పెన్స్​కు తెరపడింది. 

శుక్రవారమే నామినేషన్లు ఫైల్ చేసేందుకు ఆఖరి రోజు కావడంతో డెడ్​లైన్​కు గంట ముందు సంబంధిత పత్రాలను ఎన్నికల అధికారిణి హర్షిత మాథూర్​కు రాహుల్ గాంధీ అందజేశారు. ఆయన వెంట మల్లికార్జున ఖర్గే, సోనియా, ప్రియాంక, రాబర్ట్ వాద్రా, అశోక్ గెహ్లాట్ ఉన్నారు. దీనికి ముందు శుక్రవారం పొద్దున రాయ్​బరేలీ ఎంపీ స్థానానికి రాహుల్ పేరును ఖరారు చేయగానే.. ఢిల్లీ నుంచి అందరూ నేరుగా అమేథీలోని ఫుర్సత్​గంజ్ ఎయిర్​పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా రాయ్​బరేలీ కలెక్టరేట్​​కు చేరుకుని నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

బీజేపీ నుంచి దినేశ్ ప్రతాప్ సింగ్

2019 లోక్​సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేశారు. అమేథీలో  స్మృతి ఇరానీ చేతిలో ఆయన ఓడిపోయారు. వయనాడ్ నుంచి గెలిచారు. ఈసారి మాత్రం రాయ్​బరేలీ నుంచి బరిలో దిగుతున్నారు. బీజేపీ తరఫున ఈ స్థానం నుంచి దినేశ్ ప్రతాప్ సింగ్, బీఎస్పీ నుంచి ఠాకూర్ ప్రసాద్ యాదవ్ పోటీలో ఉన్నారు. రాయ్​బరేలీ.. కాంగ్రెస్​కు కంచుకోట. రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ, అమ్మమ్మ ఇందిరా గాంధీ, తాతయ్య ఫిరోజ్ గాంధీ ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు.

భాగ్ రాహుల్.. భాగ్.. అంటూ బీజేపీ సెటైర్లు

రాహుల్ గాంధీ రాయ్​బరేలీ నుంచి పోటీ చేస్తుండటంతో ‘భాగ్ రాహుల్.. భాగ్..’అంటూ బీజేపీ లీడర్లు సెటైర్లు వేశారు. అమేథీ నుంచి రాయ్​బరేలీకి షిఫ్ట్ కావడంతో కాంగ్రెస్ ఓటమి ఖరారైనట్టే అని బీజేపీ జనరల్ సెక్రటరీ దుశ్యంత్ కుమార్ గౌతమ్ విమర్శించారు. అమేథీలో ఓటమిని కాంగ్రెస్ ఒప్పుకున్నట్టేనని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. అందుకే రాహుల్ అమేథీ నుంచి రాయ్​బరేలీకి దూకాడని విమర్శించారు. దక్షిణాదిలో ఓటమి భయంతో రాహుల్ గాంధీ వయనాడ్‌‌తో పాటు రాయ్‌‌బరేలీ లోక్‌‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.

ఖర్గేతో కలిసి రేవంత్​ రెడ్డి హాజరు

రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రాహుల్ నామినేషన్ ప్రోగ్రామ్​కు అటెండ్ అయ్యేందుకు ఖర్గే ప్రత్యేక విమానంలో రాయ్‌‌బరేలీ బయలుదేరారు. మార్గమధ్యలో బేగంపేట్ ఎయిర్​ పోర్టులో ఆగారు. దీంతో రేవంత్ రెడ్డి ఖర్గేతో కలిసి ఇదే విమానంలో వెళ్లారు. కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్​ రెడ్డి తిరిగి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బేగంపేట్ కు చేరుకున్నారు.