బాసెల్: స్విస్ ఓపెన్ సూపర్–300 టోర్నీలో.. తెలంగాణ షట్లర్ మన్నేపల్లి తరుణ్ పోరాడి ఓడాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్ 43వ ర్యాంకర్ తరుణ్ 19–21, 21–19, 13–21తో అంథోనీ సినిసుకా గింటింగ్ (ఇండోనేసియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. దాంతో ఈ టోర్నీలో ఇండియన్ షట్లర్ల పోరాటం ముగిసింది. 66 నిమిషాల మ్యాచ్‌లో తొలి రెండు గేమ్‌ల్లో తరుణ్ అద్భుతంగా ఆడాడు.
గింటింగ్ తొలి గేమ్‌ను 6–2 ఆధిక్యంతో మొదలుపెట్టినా క్రమంగా పుంజుకున్న తెలంగాణ ప్లేయర్ 11–11తో సమం చేశాడు. కానీ గింటింగ్ బలమైన షాట్ల ముందు మళ్లీ గాడి తప్పాడు. దాంతో ఇండోనేసియా ప్లేయర్ 16–12తో దూసుకుపోయాడు. అదే జోరుతో నాలుగు గేమ్ పాయింట్లు నెగ్గాడు. తరుణ్ మూడు గేమ్ పాయింట్లను కాచుకున్నా ప్రయోజనం దక్కలేదు. రెండో గేమ్‌లో వ్యూహాత్మకంగా ఆడిన తరుణ్ 6–6, 11–7, 19–13తో లీడ్‌లో నిలిచాడు.
అయినా పట్టు విడవకుండా పోరాడిన గింటింగ్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 19–19తో స్కోరు సమం చేశాడు. ఈ దశలో తరుణ్ రెండు స్మాష్‌లతో గేమ్ నెగ్గాడు. డిసైడర్‌లో గింటింగ్‌ను ఆపడం తరుణ్‌కు ఏమాత్రం సాధ్యం కాలేదు. దాంతో వరుసగా పాయింట్లు కోల్పోయాడు. 10–11తో దగ్గరగా వచ్చినా చివర్లో మళ్లీ తడబడ్డాడు. ఫలితంగా గింటింగ్ స్పష్టమైన ఆధిక్యంతో గేమ్, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
