జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇండ్లు నిరుపయోగ స్థలాలను గుర్తించండి: సీఎం రేవంత్ రెడ్డి 

జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇండ్లు నిరుపయోగ స్థలాలను గుర్తించండి: సీఎం రేవంత్ రెడ్డి 
  • వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు.. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో
  • 7,680 ఫ్లాట్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమని వెల్లడి
  • క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష..  పాల్గొన్న మంత్రులు పొంగులేటి, పొన్నం

హైదరాబాద్, వెలుగు: కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల్లోనే ఉండేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వివిధ శాఖల పరిధిలో నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించాలని సూచించారు. శుక్రవారం క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్​తో కలిసి ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో గుర్తించిన స్థలాల వివరాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పోలీసు, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి ఇప్పటికే గుర్తించిన నిరుపయోగ స్థలాలను తీసుకుని, ఆయా శాఖలకు వేరేచోట స్థలాలు కేటాయించాలని రేవంత్​రెడ్డి ఆదేశించారు. 

జనావాసాలకు దూరంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తే.. లబ్ధిదారుల జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తడంతో పాటు ఇండ్లు నిరుపయోగంగా మారే అవకాశం ఉందని సీఎం చెప్పారు. అలా కాకుండా పని ప్రదేశాలకు దగ్గరగా, జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేలా చూడాలన్నారు. దీని వల్ల నిరుపేదలు బతుకుదెరువు కోల్పోకుండా ఉంటారని తెలిపారు. 

స్థలాల గుర్తింపు స్పీడప్​.. 

తొలి దశలో 17 నియోజకవర్గాల్లో  7 వేల 680 ఫ్లాట్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. రాజేంద్ర నగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్‌‌‌‌గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూర్‌‌‌‌పురా, అంబర్‌‌‌‌పేట, కూకట్‌‌‌‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్‌‌‌‌పేట్ నియోజకవర్గాల్లో ప్రభుత్వం తొలి విడతలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనుంది.

ఆయా నియోజకవర్గాల పరిధిలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించే ప్రక్రియను అధికారులు స్పీడప్​ చేశారు. ఒక్కో ఫ్లాట్ దాదాపు 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మించనున్నారు. వీటి నిర్మాణానికి దాదాపు రూ.11 లక్షలు ఖర్చవుతుండగా.. ప్రభుత్వం ఇందులో రూ.5 లక్షల భారీ సబ్సిడీ అందిస్తోంది. మిగిలిన రూ.6 లక్షలను లబ్ధిదారుడు తన వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ల్యాండ్ కాస్ట్‌‌‌‌‌‌‌‌ను మాత్రం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది.  

సమావేశంలో ఆర్ అండ్ బీ  స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, డీజీపీ సీవీ ఆనంద్,  సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శ్రీధర్, శేషాద్రి, రెవెన్యూ సెక్రటరీ లోకేశ్ కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హౌజింగ్ స్పెషల్ సెక్రటరీ వీపీ గౌతమ్, కలెక్టర్ ప్రియాంక ఆల పాల్గొన్నారు.