హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లను, వ్యాయామ విద్యను బలోపేతం చేయాలని తెలంగాణ పీడీ అండ్ పీఈటీ సంఘం ప్రతినిధుల బృందం కోరింది. శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, అడిషనల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. అర్హత ఉన్న పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని, బీపీఈడీ అర్హత లేని వారికి పీఏటీ టెస్ట్ నిర్వహించాలని, ఎంపీఈడీ ఉన్న వారికి జూనియర్ కాలేజీల్లో ప్రమోషన్ఇవ్వాలని కోరారు.
విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న స్కూళ్లలో అదనపు పీడీలను నియమించాలన్నారు. ప్రైమరీ నుంచి హైస్కూల్ వరకు ఖాళీలను భర్తీ చేసేందుకు అదనంగా 3 వేల పోస్టులతో ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని కోరారు. సంఘం గౌరవ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, అధ్యక్షుడు దుమార్ల నిరంజన్, ప్రధాన కార్యదర్శి మహ్మద్ సాబేర్ తదితరులు పాల్గొన్నారు.
