బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ‘ఫెవికాల్ బంధం’ .. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శ

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ‘ఫెవికాల్ బంధం’ .. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శ
  • విద్యార్థులు, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు లేదని ఫైర్

న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఇప్పటికీ ‘ఫెవికాల్ బంధం’ కొనసాగుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. అందువల్లే కాళేశ్వరం అంశంలో సీబీఐ విచారణ వేగంగా ముందుకు సాగడం లేదని ఆరోపించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం తెలంగాణ భవన్‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులు, ఆర్థిక సహకారం కేంద్రంలోని బీజేపీ హయాంలోనే లభించాయని గుర్తుచేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీలు కలవాల్సింది కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌‌‌‌‌‌‌‌ను కాదని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ను అని సూచించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ వివేదనతో పాటు సీబీఐ విచారణ కూడా కోరినట్లు వివరించారు. తెలంగాణలో ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్‌‌‌‌‌‌‌‌ను ఎత్తివేసిన వారే.. నేడు అక్కడ ధర్నాలు చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. విద్యార్థులు, రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు లేదని ధ్వజమెత్తారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌‌‌‌‌ను కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.