- జగిత్యాల జిల్లా మెట్‌పల్లి కాల్పుల ఘటనను ఛేదించిన పోలీసులు
కోరుట్ల, వెలుగు : జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో గత నెల మహిళపై కాల్పుల ఘటన కేసును ఛేదించిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం మెట్ పల్లిలో డీఎస్పీ రాములు వివరించారు. పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన గోనెల శంకర్, గోనెల రాజం అన్నదమ్ములు. వ్యవసాయ భూమి, ఇంటికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాజం భార్య లక్ష్మిని హత్య చేసేందుకు గోనెల శంకర్, అతడి భార్య అనూష, బంధువు గోపి ముత్తయ్య కలిసి ప్లాన్ చేశారు.
ఇందులో భాగంగా శంకర్ వద్ద జేసీబీ డ్రైవర్ గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాకు చెందిన సచిన్ కుమార్ అలియాస్ సచిన్ వర్మను సంప్రదించి లక్ష్మిని హత్య చేస్తే భారీ మొత్తంలో డబ్బు ఇవ్వడంతో పాటు సౌదీ వెళ్లేందుకు ఆర్థికసాయం కూడా చేస్తామని చెప్పారు. దీంతో హత్యకు సచిన్ ఒప్పుకున్నాడు. తర్వాత సచిన్ ఈ ఏడాది మార్చిలో యూపీ వెళ్లి ఓ నాటు పిస్టల్, మూడు క్యాట్రిడ్జ్ లు కొనుగోలు చేసి మెట్‌పల్లికి తీసుకొచ్చాడు.
జూన్13న లక్ష్మి ఇంటికి వెళ్లిన సచిన్ భయంతో కాల్పులు జరపకుండా తిరిగొచ్చాడు. తర్వాత 15న అర్ధరాత్రి లక్ష్మి ఇంటికి వెళ్లి వరండాలో పడుకున్న ఆమెపై కాల్పులు జరిపి పరారయ్యాడు. తర్వాత శంకర్ తనకేమీ తెలియనట్లుగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, కర్రలతో దాడి చేసినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. దాడిలోనే లక్ష్మి గాయపడినట్లు భావించి హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ లో లక్ష్మిని పరీక్షించిన డాక్టర్లు తలలో మెటల్ ఆబ్జెక్ట్ కనిపించడం, అది బుల్లెట్ అని ఫోరెన్సిక్ పరీక్షలో తేలడంతో కేసు మరో మలుపు తిరిగింది.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు వివిధ ఆధారాలను పరిశీలించి శంకర్, అనూష, గోపి ముత్తయ్యను గత నెల 16న అరెస్ట్ చేయగా, ఈ నెల 20న సచిన్ ను ప్రయాగ్‌రాజ్ లో అదుపులోకి తీసుకొని మెట్‌పల్లికి తీసుకొచ్చారు. నిందితుల నుంచి పిస్టల్, రెండు కాట్రిడ్జ్ లు, బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
