- ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ.. 3 నెలల్లోపే చర్యలు
- పేపర్ లీక్ కేసుల్లో మరింత కఠిన శిక్షలపై కేంద్రం ఫోకస్
- 2024లో తెచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్’ చట్టాన్ని సవరించనున్న ప్రభుత్వం
- పేపర్ లీక్ దోషులకు కనీస శిక్ష 3 ఏండ్ల నుంచి 5 ఏండ్లకు పెంపు
- పరీక్షలు రాసే అభ్యర్థులకు చట్ట నిబంధనల నుంచి మినహాయింపు
- సవరణలతో డ్రాఫ్ట్ బిల్లు రెడీ.. కేంద్ర కేబినెట్ ఆమోదం
- అర్ధరాత్రి ప్రధాని ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ఆమోదించిన కేబినెట్
- బిల్లును ఎల్లుండి సభలో ప్రవేశపెట్టే చాన్స్
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఎగ్జామ్ పేపర్‌లను లీక్ చేసేవారికి శిక్షలను మరింత కఠినతరం చేసేలా ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్’ చట్టాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దోషులకు గరిష్టంగా రూ.10 కోట్ల వరకు జరిమానా, 10 ఏండ్ల జైలు శిక్ష విధించేలా సవరణలు ప్రతిపాదించిన ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది.
పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ డ్రాఫ్ట్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. పేపర్ లీకేజీల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని, మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామంటూ గురువారం అర్ధరాత్రి ప్రధాని ప్రకటించగా.. ఆ తర్వాత కొన్ని గంటలకే ఈ డ్రాఫ్ట్ బిల్లును మంత్రి మండలి ఆమోదించినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
సోమవారం పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెడతామని కూడా ప్రధాని తన వీడియో సందేశంలో చెప్పారు. ఈ నేపథ్యంలో ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024’కు సవరణలతో తెచ్చిన ఈ ముసాయిదా బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి.
ఫాస్ట్ ట్రాక్ కోర్టులు.. మూడు నెలల్లోపే చర్యలు..
ఎగ్జామ్ పేపర్ లీక్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే నిబంధనను ఈ డ్రాఫ్ట్ బిల్లులో చేర్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మూడు నెలల వ్యవధిలోగా కేసును పరిష్కరించి, తీర్పును ప్రకటించాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న చట్టంతో పోలిస్తే పేపర్ లీకేజీలకు పాల్పడే వారికి మరింత కఠినమైన శిక్షలు పడేలా డ్రాఫ్ట్ బిల్లును రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
ఈ బిల్లు ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024’ను సవరిస్తుంది. దీని ద్వారా పేపర్ లీకేజీలకు పాల్పడే వ్యక్తులకు కనీసం 5 ఏండ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధించాలని ప్రతిపాదిస్తున్నారు. వ్యవస్థీకృతంగా (ఆర్గనైజ్డ్‌గా) పేపర్ లీకేజీలకు పాల్పడే కేసుల్లో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనలను చేర్చినట్లు వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం ఉన్న చట్టంలో వ్యక్తులకు 3 నుంచి 5 ఏండ్ల జైలు శిక్ష, అలాగే కాపీయింగ్, పేపర్ లీకేజీల వంటి ఆర్గనైజ్డ్ నేరాలకు పాల్పడే వారికి 5 నుంచి 10 ఏండ్ల జైలు శిక్షతో పాటు కనీసం రూ. కోటి జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడే ముఠాలు, సంస్థలను అరికట్టడమే లక్ష్యంగా ఈ డ్రాఫ్ట్ బిల్లును తెస్తున్నారు. అదేసమయంలో పరీక్షలు రాసే అభ్యర్థులకు ఈ చట్టం నిబంధనల నుంచి మినహాయింపునిస్తూ రక్షణ కల్పించనున్నారు.
2024 చట్టానికి సవరణలు..
రెండేండ్ల క్రితం పేపర్ లీకేజీలపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగిన తర్వాత.. పేపర్ లీకేజీలు, కాపీయింగ్‌ల నివారణ కోసం ప్రధాని మోదీ ప్రభుత్వం ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024’ పేరుతో చట్టాన్ని తీసుకొచ్చింది. దేశంలో ఎగ్జాం పేపర్ లీక్‌ల నివారణకు తీసుకొచ్చిన తొలి చట్టం ఇదే. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో తెచ్చిన విద్యా విధానంలో పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు చట్టం తీసుకురావాలని పేర్కొన్నప్పటికీ, 2024 వరకూ గత ప్రభుత్వాలు ఎలాంటి చట్టాన్ని తీసుకురాలేదు.
తాజాగా నీట్ పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో ప్రధాని మోదీ సర్కారు ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్’ చట్టాన్ని సవరించి, మరింత కఠినతరం చేయాలని నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ వంటి ఉద్యోగ నియామక పరీక్షలతో పాటు నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీసులను అరికట్టడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
