హైదరాబాద్ రీజినల్ రింగ్ రైల్ కు కేంద్రం ఓకే .. డీపీఆర్ సర్వేకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ రీజినల్ రింగ్ రైల్ కు కేంద్రం ఓకే .. డీపీఆర్ సర్వేకు  గ్రీన్ సిగ్నల్
  • డీపీఆర్ సర్వే చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్
  • రీజినల్ రింగ్ రోడ్డు వెంట రైల్వే లైన్ ఉండేలా కసరత్తు
  • ఎంపీ చామల లేవనెత్తిన ప్రశ్నకు కేంద్రం సమాధానం


న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ సిటీ చుట్టూ ప్రతి ష్టాత్మకంగా నిర్మించనున్న రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు కు సంబంధించి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయారీ కోసం సర్వే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్ రెడ్డి రూల్ –377 కింద ఈ ప్రాజెక్ట్ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై కేంద్ర రైల్వే శాఖ సహా య మంత్రి రవనీత్ సింగ్ స్పందిస్తూ ఎంపీకి ఈ నెల 6న లేఖ రాశారు. 

శనివారం ఈ లేఖను ఎంపీ చామల మీడియాకు విడుదల చేశారు. ప్రస్తుతం రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) వెంటే ఈ రైల్వే లైన్ ఉండేలా అలైన్‌మెంట్‌ను ఖరారు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో  కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నదని మంత్రి రవనీత్ సింగ్ తెలిపారు. డీపీఆర్ సిద్ధమైన తర్వాత ప్రాజెక్ట్ మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం, ఇతర వాటాదారులతో చర్చలు జరపాల్సి ఉంటుందని చెప్పారు. నీతి ఆయోగ్, ఆర్థిక మంత్రిత్వ శాఖల నుంచి తుది అనుమతులు, వ్యయ అంచనాల ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు మంజూరు ఒక నిరంతర, డైనమిక్ ప్రక్రియ అయినందున.. ప్రస్తుతం ఇది ప్రాథమిక దశలోనే ఉన్నందున, ఇది ఎప్పటికీ  పూర్తవుతుందనే  దానిపై కచ్చితమైన గడువును ఇప్పుడే చెప్పలేమని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని వివరించారు.