CWG 2026 Closing Ceremony: 11 రోజుల పాటు శ్రమించి పతకాలతో రచ్చ చేసిన క్రీడాకారుల అద్భుత పోరాటాలకు గ్లాస్గో వేదికగా తెరపడనుంది. కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగింపు వేడుకలు (Closing Ceremony) శనివారం అర్థరాత్రి (ఆగస్టు 2న ఆదివారం రాత్రి 9:00 PM BST / భారత్‌లో ఆగస్టు 3 సోమవారం తెల్లవారుజామున 1:30 AM IST) గ్లాస్గోలోని ఓవో హైడ్రో (OVO Hydro) ఇండోర్ అరేనాలో అత్యంత వైభవంగా జరగనున్నాయి.
కామన్వెల్త్ గేమ్స్ 2030:
ఈ ముగింపు వేడుకలో అత్యంత కీలకమైన ఘట్టం.. కామన్వెల్త్ గేమ్స్ 2030 శతాబ్ది ఎడిషన్ (Centenary Edition) ఆతిథ్య హక్కుల అధికారిక మార్పిడి (Handover) జరగనుంది. 1930లో హ్యామిల్టన్ (కెనడా) వేదికగా ప్రారంభమైన ఈ క్రీడలు 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ, 2030లో భారత్‌లోని అహ్మదాబాద్ నగరం ఈ చారిత్రాత్మక కామన్వెల్త్ వేడుకలకు ఆతిథ్యం ఇవ్వనుంది.
లైవ్ స్ట్రీమింగ్ వివరాలు:
* వేదిక: ఓవో హైడ్రో, గ్లాస్గో (స్కాట్లాండ్)
* సమయం: ఆగస్టు 3 (సోమవారం) తెల్లవారుజామున 1:30 AM IST
* లైవ్ టెలికాస్ట్ (భారత్‌లో): సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (Sony Sports Network)
* లైవ్ స్ట్రీమింగ్: సోనీ లివ్ (Sony LIV) యాప్ & వెబ్‌సైట్
అహ్మదాబాద్ 2030' గ్రాండ్ షోకేస్:
స్కాట్లాండ్ ప్రతినిధుల నుంచి కామన్వెల్త్ గేమ్స్ జెండాను, కింగ్స్ బ్యాటన్ ను గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘ్వీ నేతృత్వంలోని భారత బృందం స్వీకరించనుంది. ఈ హ్యాండోవర్ సందర్భంగా 20 నిమిషాల పాటు భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని చాటే అద్భుత ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించనున్నాయి.
* వందేమాతరం 150 ఏళ్ల ఘట్టం: మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ నేతృత్వంలో వందేమాతరం జాతీయ గేయం 150 సంవత్సరాల వేడుకను పురస్కరించుకుని ప్రత్యేక నృత్య రూపకం.
* ఇండో-స్కాటిష్ జుగల్బందీ: భారత సితార్ విద్వాంసుడు రిషభ్ రికీరామ్ శర్మ, స్కాటిష్ పైపర్ రోస్ ఐన్స్లీల కాంబినేషన్‌లో సితార్-పైప్స్ ఫ్యూజన్ మ్యూజిక్.
* గుజరాత్ సాంస్కృతిక పండుగ: సంగీత దిగ్గజం శంకర్ మహదేవన్, అతడి కుమారులు సిద్ధార్థ్, శివమ్‌లతో పాటు గుజరాత్ గాయని భూమి త్రివేదిల పవర్-ప్యాక్డ్ లైవ్ పెర్ఫార్మెన్స్.
స్కాటిష్ సంగీత హోరు.. లైవ్ ఆర్టిస్ట్‌ల హంగామా:
గ్లాస్గో కల్చరల్ హెరిటేజ్‌ను ప్రతిబింబించేలా స్కాట్లాండ్ రికార్డు బ్యాండ్ సింపుల్ మైండ్స్ (Simple Minds) ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వీరితో పాటు ప్రముఖ గాయకులు శాండీ తోమ్, క్యామీ బార్న్స్, డెల్టా గుడ్రెమ్, డాన్స్ గ్రూప్ డైవర్సిటీ తదితరులు తమ ప్రదర్శనలతో ముగింపు వేడుకలను హోరెత్తించనున్నారు. అథ్లెట్ల పరేడ్, స్కాటిష్ సాంస్కృతిక ప్రదర్శనలు, చివరిగా కామన్వెల్త్ జ్వాల (CWG Flame) ఆర్పివేతతో గ్లాస్గో గేమ్స్‌కు అధికారికంగా ముగింపు పడుతుంది. ప్రపంచ దృష్టి అంతా ఇప్పుడు 2030లో భారత్ నిర్వహించబోయే 100వ సంవత్సరపు కామన్వెల్త్ గేమ్స్ పైకి మళ్లింది.
𝐆𝐥𝐚𝐬𝐠𝐨𝐰 𝐬𝐢𝐠𝐧𝐬 𝐨𝐟𝐟. 𝐀𝐦𝐝𝐚𝐯𝐚𝐝 𝐬𝐚𝐲𝐬 𝐡𝐞𝐥𝐥𝐨. ✨
— Sony Sports Network (@SonySportsNetwk) August 2, 2026
Celebrate the memories, the champions, and witness the Commonwealth Games flag make its historic journey from Glasgow to Amdavad, host of the landmark 2030 Centenary Games.
Watch the Closing Ceremony,… pic.twitter.com/vE1kkzXEcF
