హైదరాబాద్: ఆషాఢమాస బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుఫున అమ్మవారికి సీఎం రేవంత్ పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, తదితరులు ఉన్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. ఆదివారం (ఆగస్ట్ 2) తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పొటెత్తారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
అమ్మవారి దర్శనానికి పెరిగిన వీఐపీల తాకిడి:
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి వీఐపీల తాకిడి పెరిగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు రాజకీయ ప్రముఖులు క్యూ కట్టారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. వీఐపీల రాక నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు.. అమ్మవారికి బోనం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు.
