- రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ పంపిణీపై రియల్ టైమ్ మానిటరింగ్
- జీపీఎస్ ట్రాకింగ్‌తో సరఫరాపై నియంత్రణ, పంపిణీపై నిఘా
- టోల్ ఫ్రీ నంబర్ 1967 ద్వారా ఫిర్యాదులకు తక్షణ స్పందన
- సివిల్ సప్లయ్స్ ఆఫీస్‌లో ప్రారంభించిన సర్కారు
- సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు
- బ్లాక్ చేస్తే చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఆటంకాలు, ఎల్పీజీ సరఫరాలో అవాంతరాల నేపథ్యంలో రాష్ట్రంలో గృహ వినియోగదారులకు వంటగ్యాస్ అంతరాయం లేకుండా చూసేందుకు తెలంగాణ సివిల్ సప్లైస్ శాఖ 24 గంటల మల్టీ ఏజెన్సీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా ఎల్పీజీ పంపిణీని రియల్ టైమ్‌లో పర్యవేక్షిస్తుంది. శనివారం ప్రారంభమైన ఈ 24/7 సెంటర్ ద్వారా గ్యాస్ ట్రాన్స్‌పోర్టేషన్ వాహనాల జీపీఎస్ ట్రాకింగ్‌తో నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది.
ఇది సిలిండర్ సప్లయ్ చైన్ లో ఏవైనా అడ్డంకులను గుర్తించి, వాటిని తక్షణమే పరిష్కరించే సెంట్రల్ హబ్‌గా పనిచేస్తుంది. రాష్ట్ర సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో ఈ సెంటర్ నడుస్తుంది. సివిల్ సప్లయ్స్ కమిషనర్ నేతృత్వంలోని బృందం జిల్లా అధికారులతో నిరంతర సమన్వయం చేస్తూ రవాణా లాజిస్టిక్స్‌ను పర్యవేక్షిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రోజువారీ స్టాక్ లభ్యతను తనిఖీ చేస్తుంది. పారదర్శకతను నిర్ధారించేందుకు ప్రభుత్వం ప్రధాన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియంకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కంపెనీలు తమ ఫ్లీట్ జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌లకు రాష్ట్ర అధికారులకు తక్షణమే సమాచారం కల్పించాలని ఆదేశించింది. దీంతో రవాణా జాప్యం, సిలిండర్ల దారి మళ్లింపులను పూర్తిగా నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
తక్షణం స్పందించే వ్యవస్థ..
ఈ కమాండ్ సెంటర్‌లో ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రతినిధులు, పోలీసు శాఖ, ఇండస్ట్రీస్, డిస్ట్రిబ్యూటర్ల సంఘం ప్రతినిధులు రోటేషన్ పద్ధతిలో ఫిజికల్‌గా ఉంటారు. ఇది సమన్వయాన్ని మరింత సుసాధ్యం చేస్తుంది. సరఫరాలో ఏవైనా హెచ్చుతగ్గులు ఉంటే తక్షణం స్పందించే వ్యవస్థ ఏర్పడింది. అదనంగా, సివిల్ సప్లైస్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1967 కూడా ఈ కమాండ్ సెంటర్‌తో కలిపి ఉంచారు. ప్రజలు ఎల్పీజీ సరఫరా, పంపిణీ సమస్యలపై ఈ నంబర్‌కు సంప్రదించవచ్చు.
ఈ చర్యల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు, ప్రాధాన్యతా వాణిజ్య రంగాలకు ఎల్పీజీ సరఫరా నిరంతరంగా ఉండేలా చూస్తోందని సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ప్రజలు అనవసర ఆందోళన చెందకుండా, అవసరమైనప్పుడు మాత్రమే సిలిండర్లు బుక్ చేసుకోవాలని కోరారు.
నిరంతర పర్యవేక్షణ ఇలా..
- ఎల్పీజీ ట్రాన్స్‌పోర్టేషన్, స్టాక్ లెవల్స్, జిల్లాల వారీగా పంపిణీని 24 గంటలూ ట్రాక్.
- ఆయిల్ కంపెనీలు రియల్ టైమ్ జీపీఎస్ డేటాను రాష్ట్ర అధికారులతో పంచుకోవడం.
- జిల్లా స్థాయిలో స్థానిక సమస్యలను తక్షణం పరిష్కరించేందుకు రోజువారీ కోఆర్డినేషన్.
సిలిండర్లు బ్లాక్చేస్తే కఠిన చర్యలు: మంత్రి ఉత్తమ్
గ్యాస్ సిలిండర్లు బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లను హెచ్చరించారు. శనివారం సెక్రటేరియెట్‌లో ఎల్పీజీ, ఆయిల్ సరఫరా చేసే ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో గృహ అవసరాలకు ఎలాంటి వంటగ్యాస్ కొరత లేదని, వాణిజ్య సిలిండర్ల కొరత మాత్రమే ఉందని చెప్పారు. కమర్షియల్ సిలిండర్లను కేంద్రం 20 శాతం సప్లై చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు.. డొమాస్టిక్ కన్జుమర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలు గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతాయని, కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో ముందుగానే ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారని, దీనితో సాధారణం కంటే రెట్టింపు సిలిండర్లు బుక్ అవుతున్నాయని తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే రోజువారి కంటే అదనంగా 12వేల సిలిండర్లు సరఫరా చేశామని తెలిపారు. అవసరం లేకున్నా ముందస్తుగా గ్యాస్ బుక్ చేసుకోవద్దని సూచించారు. కావాలని గ్యాస్ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. “ పరిస్థితులపై నిన్న అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాం.
రాష్ట్రంలో 810 మంది ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ లు ఉన్నారు. 1.30 కోట్ల డొమెస్టిక్ కన్జూమర్స్ ఉన్నారు. దీపం పథకం కింద 28 లక్షల మంది ఎల్పీజీని వినియోగిస్తున్నారు. 7.50 లక్షల కమర్షియల్ కన్జూమర్స్ ఉన్నారు. నెలకు యావరేజ్ గా 60 లక్షల సిలిండర్లు డొమెస్టిక్ వాడుతున్నారు. ప్రతి రోజు 2.15 లక్షల ఎల్పీజీ డొమాస్టిక్ సిలిండర్లు సప్లై చేస్తారు. నిన్న మొన్న 2.30 లక్షలు సప్లై చేశారు. కమర్షియల్ సిలిండర్లు రోజుకు 23 వేలు సప్లై చేసే వాళ్లు. కానీ, ప్రస్తుతం 6,200 సిలిండర్లు మాత్రమే ఇస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ విషయంలోనే కొరత ఏర్పడుతోంది. కమర్షియల్ సిలిండర్ల విషయంలో కేంద్రానికి లేఖ రాశాం. స్కూల్స్, కాలేజెస్, సెంటర్, స్టేట్ గవర్నమెంట్ సంస్థలకు కమర్షియల్ సిలిండర్ల విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నాం. సివిల్ సప్లై భవన్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఎవరైన కృత్రిమంగా గ్యాస్ కొరత సృష్టించినా.. బ్లాక్ మార్కెట్ చేసినా హెల్ఫ్ లైన్ 180042500344 కు కాల్ చేయొచ్చు’ అరి మంత్రి ఉత్తమ్ చెప్పారు.
