అమీన్‌పూర్ (పటాన్‌చెరు)/గూడూరు/శివ్వంపేట, వెలుగు: కళ్లముందే కన్నవారు విగతజీవులైనా.. పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లోనే అదిమిపట్టి, భవిష్యత్తు కోసం ఆ విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాశారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో తల్లిదండ్రులు హత్యకు గురైతే.. గూడూరులో కూతురు వసంత కన్నీళ్లతోనే టెన్త్ ఎగ్జామ్ రాసింది. మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా.. తల్లి ఆస్పత్రిలో ఉన్నా.. తండ్రి చితికి నిప్పంటించే ముందు తూప్రాన్‌లో విద్యార్థి ధనుశ్ ఎగ్జామ్‌కు హాజరయ్యాడు. ఈ రెండు ఘటనలు ఆయా గ్రామాల ప్రజలను కలిచివేశాయి. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతులు హత్యకు గురయ్యారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దొంగచింత తండాకు చెందిన ధరావత్ సోములు (45), మంగమ్మ (40) దంపతులు నాలుగేండ్ల కింద సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం వచ్చి వెంకటేశ్వర్‌రెడ్డి అనే బిల్డర్ వద్ద వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. వీరి పెద్ద కూతురు మౌనికకు పెండ్లి జరుగగా, చిన్నకూతురు వసంత గూడూరు మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ హాస్టల్‌లో ఉంటూ టెన్త్ చదువుతున్నది. శుక్రవారం పని పూర్తి చేసుకొని ఇంట్లో పడుకున్న సోములు, మంగమ్మ దంపతులు శనివారం ఉదయం ఎంతకూ బయటకు రాలేదు.
దీంతో స్థానికులు వెళ్లి చూడగా.. ఇద్దరూ చనిపోయి కనిపించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్‌కుమార్, పటాన్‌చెరు సీఐ వినాయక్‌రెడ్డి తమ సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. హత్యా స్థలంలో ఇనుపరాడ్లు కనిపించాయి. గుర్తు తెలియని వ్యక్తులు రాడ్లతో తలపై కొట్టి దంపతులను హత్య చేసినట్లు భావిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని ఏసీపీ శ్రీనివాస్‌కుమార్ తెలిపారు. ఇదిలా ఉండగా.. సోములు, మంగమ్మ చిన్నకూతురు వసంత స్వగ్రామంలో శనివారం టెన్త్ ఎగ్జామ్‌కు హాజరుకావాల్సి ఉండగా.. తల్లిదండ్రుల హత్య విషయం తెలిసింది. అయినా.. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని ఎగ్జామ్‌కు హాజరైంది. పరీక్ష పూర్తయిన అనంతరం బంధువులతో కలిసి తండాకు చేరుకున్నది.
శివ్వంపేటలో విషాద ఘటన
ఇంట్లో తండ్రి డెడ్‌బాడీ, హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తల్లి.. ఇలాంటి పరిస్థితిలోనూ దుఃఖాన్ని కడుపులోనే దాచుకొని టెన్త్ ఎగ్జామ్‌కు హాజరయ్యాడు ఓ స్టూడెంట్. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పాంబండ గ్రామానికి చెందిన కుమ్మరి నాగరాజు (45) మేస్త్రీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం పనికి వెళ్తూ తన భార్య అంజమ్మను సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లిలోని బంధువుల ఇంటి వద్ద దింపాడు. సాయంత్రం పని ముగిసిన తర్వాత భార్యను బైక్ మీద ఎక్కించుకొని తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఉసిరికపల్లి గ్రామ శివారులోకి రాగానే బైక్ అదుపు తప్పడంతో ఇద్దరూ కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా నాగరాజు అప్పటికే చనిపోగా, అంజమ్మకు ట్రీట్‌మెంట్ కొనసాగుతున్నది. కాగా.. నాగరాజు, అంజమ్మ దంపతుల చిన్న కొడుకు ధనుష్ తూప్రాన్‌లోని ఓ ప్రైవేట్‌స్కూల్‌లో టెన్త్ చదువుతూ.. శనివారం మొదటి ఎగ్జామ్‌కు హాజరుకావాల్సి ఉంది. ఓ వైపు తండ్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా.. మరో వైపు తల్లి తీవ్రగాయాలతో హాస్పిటల్‌లో ఉన్నప్పటికీ... పుట్టెడు దుఃఖంతోనే ధనుష్ తూప్రాన్ పట్టణంలోని గవర్నమెంట్ బాయ్స్ హైస్కూల్‌లో ఎగ్జామ్‌కు హాజరయ్యాడు. పరీక్ష రాసేందుకు బయలుదేరుతున్న సమయంలో తండ్రి డెడ్‌బాడీపైన పడి బోరున విలపించడం అక్కడున్నవారిని కలచివేసింది. పరీక్ష పూర్తయ్యాక గ్రామానికి వచ్చి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.
