- రాష్ట్రంలో తొలిసారి పేపర్ లెస్ విధానంలో సెన్సస్
- ఏప్రిల్ 26 నుంచి మే 10 దాకా సెల్ఫ్ ఎన్యూమరేషన్
- మే11 నుంచి జూన్ 9 దాకా హౌసింగ్ సెన్సెస్
- అడ్డుకున్నా, సమాచారం ఇవ్వకున్నా మూడేళ్ల జైలు, వెయ్యి జరిమానా
- ఫారెన్ వాళ్లున్నా, పక్క రాష్ట్రం వాళ్లున్నా ఇక్కడే లెక్కిస్తాం
- ఆన్‌లైన్‌లో ఎవరికి వారే నమోదు చేసుకునేలా ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’
- వివరాలు అత్యంత గోప్యం.. రేషన్, సంక్షేమ పథకాలకు కోత ఉండదు
- మీడియా ఓరియంటేషన్ కార్యక్రమంలో రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో జనగణన జరగనుందని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. ఈసారి పేపర్, పెన్ను లేకుండా కేవలం మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్స్ ద్వారా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈసారి పౌరులు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే లా ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్ (ఎస్ఈ)’ సదుపాయాన్ని కేంద్రం కల్పించిందని, దీనికోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ అందుబాటులోకి తెస్తున్నామని ఆమె వివరించారు. జనగణనతో పాటే కులగణన కూడా చేపడ్తున్నామని, పౌరుల వ్యక్తిగత వివరాలకు అత్యున్నత స్థాయి భద్రత కల్పిస్తామని, ఎక్కడా గోప్యతకు భంగం వాటి ల్లదని ఆమె హామీ ఇచ్చారు. కొన్ని నెలలుగా ఇక్కడే ఉంటున్న విదేశీయులు, ఇతర రాష్ట్రాలవారి వివరాలను స్థానికంగానే నమోదు చేస్తామని చెప్పారు. హాస్ట ల్స్, ఇనిస్టిట్యూషన్స్ వివరాలు కూడా సపరేట్గా ఎంట్రీ చేస్తామన్నారు. భవిష్యత్తు ప్రభుత్వ విధానాల రూపకల్పనకు ఇది పునాది అని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భావించి ఈ డిజిటల్ మహా యజ్ఞంలో భాగస్వాములు కావాలని, కచ్చితమైన వివరాలు అందించి ప్రభుత్వానికి సహకరించాలని డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ కోఠిలోని సెన్సస్ కార్యాలయంలో జనాభా లెక్కల సేకరణ–-2027పై ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ భారతి హోళికేరి మాట్లాడారు.
రెండు దశల్లో జనాభా.. 16 భాషల్లో యాప్
జనగణనలో సేకరించే పౌరుల వివరాలకు 1948 సెన్సస్ చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం చట్టపరమైన పూర్తి భద్రత ఉంటుందని, డేటా బయటకు పొక్కదని భారతి హోళికేరి తేల్చిచెప్పారు. ఈ వివరాలను రేషన్ లేదా ఇతర సంక్షేమ పథకాల కోతకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడబోరని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అడిగిన వివరాలు ఇవ్వడానికి నిరాకరించినా, తప్పుడు సమాచారం ఇచ్చినా, అధికారులను అడ్డుకున్నా సెక్షన్ 11 ప్రకారం మూడేండ్ల వరకు జైలు శిక్షతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన, దేశాభివృద్ధికి ఈ గణాంకాలే అత్యంత ప్రామాణికంగా నిలుస్తాయన్నారు. ఏ ఒక్కరినీ వదలకుండా, డూప్లికేషన్ లేకుండా వంద శాతం కచ్చితత్వంతో పూర్తి చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియపై మారుమూల గిరిజన తండాల వరకు అవగాహన కల్పిస్తామన్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్నారు. పౌరుల సందేహాలు నివృత్తి చేసేందుకు గ్రామ స్థాయి సమావేశాలతో పాటు వాట్సాప్ గ్రూపుల ద్వారా అప్డేట్స్ ఇస్తామన్నారు. మొదటి దశలో ఇండ్ల జాబితా, గృహాల వివరాల నమోదు ప్రక్రియను 2026 మే 11 నుంచి జూన్ 9 వరకు చేపడతామని, ఆసక్తి గల పౌరులు ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ముందుగానే ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ చేసుకోవచ్చని చెప్పారు. ఇక రెండో దశలో అసలైన జనాభా గణనను 2027 ఫిబ్రవరి 9 నుంచి 28వ తేదీ వరకు దేశవ్యాప్తంగా చేపడతామని, ఎవరైనా మిగిలిపోతే మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు సవరణల రౌండ్ ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా రూపొందించిన హెచ్ఎల్ఓ మొబైల్ యాప్ క్షేత్రస్థాయిలో ఇంటర్నెట్ లేకపోయినా ఆఫ్‌లైన్‌లో కూడా సజావుగా పనిచేసేలా తీర్చిదిద్దామన్నారు. మొత్తం 16 భాషల్లో అందుబాటులో ఉండే ఈ యాప్‌లో ఇంటి పైకప్పు, వంటచెరకు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలపై ప్రశ్నలు ఉంటాయని వివరించారు. అలాగే టీవీ, కంప్యూటర్, టూవీలర్స్, కార్లు, ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు ప్రధానంగా తినే ఆహారం, మొబైల్ నంబర్ వివరాలను సైతం సేకరిస్తామని తెలిపారు.
రంగంలోకి 75 వేల మంది ఎన్యుమరేటర్లు
తెలంగాణ వ్యాప్తంగా ఈ తొలి డిజిటల్ జనగణనను విజయవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో యంత్రాంగాన్ని సిద్ధం చేశామని డైరెక్టర్ వివరించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలు, 621 సబ్- డిస్ట్రిక్ట్‌లలో ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసే బాధ్యతను కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు అప్పగిస్తూ వారిని ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్లుగా నియమించామన్నారు. క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించేందుకు సుమారు 76 వేల హౌస్ లిస్టింగ్ బ్లాకులను జియో-ట్యాగింగ్ ద్వారా మ్యాపింగ్ అప్లికేషన్‌లో ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఇంటింటికీ తిరిగి యాప్ ద్వారా వివరాలు నమోదు చేసేందుకు 10% రిజర్వ్‌తో కలిపి ఏకంగా 75వేల మంది ఎన్యుమరేటర్లను, వారిని పర్యవేక్షించేందుకు 13వేల మంది సూపర్‌వైజర్లను రంగంలోకి దించుతున్నామన్నారు. వీరందరికీ జాతీయ స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు అంచెలంచెలుగా శిక్షణ (కాస్కేడ్ ట్రైనింగ్) ఇచ్చేలా కార్యాచరణ సిద్ధమైందని తెలిపారు. టెక్నాలజీ పరంగా ఇబ్బందులు రాకుండా 2025 చివర్లో జీహెచ్ఎంసీలోని రామచంద్రాపురం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ముందుగానే ప్రీ-టెస్ట్ నిర్వహించామన్నారు. సీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా అధికారులందరూ ప్రతి రోజూ ఎప్పటికప్పుడు డేటాను పర్యవేక్షిస్తారని, తప్పులు దొర్లితే ఎన్యుమరేటర్లకు వెంటనే ఎస్ఎంఎస్ వెళ్లి, ఆన్ -స్పాట్‌లోనే డేటాను సవరించేలా ఈ ఆన్‌లైన్ సిస్టమ్‌ను పకడ్బందీగా డిజైన్ చేశామని ఆమె తెలిపారు.
నిరాశ్రయుల డాటా సైతం..
ఏ ఒక్క పౌరుడూ లెక్కల్లో మిగిలిపోకుండా ఉండేందుకు వీధులు, ఫ్లైఓవర్ల కింద, రైల్వే స్టేషన్ల వద్ద నివసించే నిరాశ్రయుల (హౌస్‌లెస్ పాపులేషన్) జనాభాను ప్రత్యేకంగా ఫిబ్రవరి 28 రాత్రి వేళల్లో మాత్రమే ఎన్యుమరేటర్లు లెక్కిస్తారని భారతీహోళికేరి చెప్పారు. మాస్టర్ ట్రైనర్ల కింద 1,220 మంది ఫీల్డ్ ట్రైనర్లు, వారి కింద 3,728 మంది చార్జ్ క్లర్కులు శిక్షణ పొందుతారని, వీరంతా కలిసి తుది దశలో ఏకంగా 88,470 మంది ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లను సర్వే కోసం సర్వసన్నద్ధం చేస్తారన్నారు. ఈ మొబైల్ ఆధారిత సర్వేలో ఎన్యుమరేటర్లు వాడే స్మార్ట్‌ఫోన్ల సామర్థ్యంపై కూడా మార్గదర్శకాలు ఇచ్చారు. కనీసం ఆండ్రాయిడ్ 11.0 లేదా ఐఓఎస్ 15.0 ఆపై వెర్షన్ ఉండి, 4 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఫోన్లకు తప్పనిసరిగా ఉండాలని స్పష్టంచేశారు.
