ఖాళీగానే డిప్యూటీ స్పీకర్ పదవి

ఖాళీగానే డిప్యూటీ స్పీకర్ పదవి
  • ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ పేరు ఖారారైనా నేటికీ వెలువడని నోటిఫికేషన్​
  • భర్తీకాని చీఫ్ ​విప్, రెండు విప్​ పోస్టులు
  • పీఈసీ చైర్​పర్సన్​ పదవీ ఖాళీగానే! 
  • ఈ బడ్జెట్​ సమావేశాల్లోనైనా నియమిస్తారా? లేదా? అనే చర్చ

హైదరాబాద్, వెలుగు: రేపటి (సోమవారం) నుంచి అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలక పదవుల భర్తీపై చర్చ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు గడుస్తున్నా నేటికీ డిప్యూటీ స్పీకర్ ను నియమించలేదు. అటు వివిధ కారణాలతో ఖాళీ అయిన చీఫ్ విప్, రెండు విప్ పోస్టులను, కీలకమైన పబ్లిక్ ఎస్టిమేట్  కమిటీ (పీఈసీ) చైర్​పర్సన్​ పదవినీ ఖాళీగానే పెట్టారు. ఈ క్రమంలో వీటిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కనీసం ఈ బడ్జెట్ సెషన్ లోనైనా ఈ పదవుల భర్తీపై సీఎం రేవంత్  దృష్టి పెడతారా, లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. డిప్యూటీ స్పీకర్ పదవికి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్ పేరును ఇప్పటికే  ప్రకటించారు.

ఆ తర్వాత రెండుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా  డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. కనీసం ఈ సెషన్ లోనైనా నోటిఫికేషన్ ఇస్తారా? లేదా? అనే చర్చ జరుగుతోంది. ఈ  పదవి ఏకగ్రీవం అవుతుందా? లేదంటే  ప్రతిపక్షం మరో అభ్యర్థిని రంగంలోకి దింపుతుందా? చూడాల్సి ఉంది. సంఖ్యాబలం ప్రకారం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ కు ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. కానీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ఈ విషయంలో అధికార పక్షానికి సహకరిస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

సీనియర్ ఎమ్మెల్యేకు చీఫ్ విప్ పదవి!

ఇక మంత్రి పదవి ఆశిస్తున్న ఓ సీనియర్ ఎమ్మెల్యేకు చీఫ్ విప్ పదవి ఇచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. రంగారెడ్డి జిల్లాకు కేబినెట్ లో ఇప్పటి వరకు చోటు లేకపోవడంతో ఆ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు  మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వారిలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రాంమ్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరికి చీఫ్ విప్ పదవి ఇచ్చి, మరొకరిని ఆర్టీసీ చైర్మన్ పదవిలో నియమిస్తారనే చర్చ సీఎల్పీలో సాగుతోంది. ఇక మరో రెండు విప్ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. విప్ గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కేబినెట్ లోకి తీసుకోవడంతో ఆ పదవి ఖాళీ అయింది.

ఇక ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ గా ప్రకటించిన రాంచంద్రు నాయక్ ప్రస్తుతం విప్ గా కొనసాగుతున్నారు. ఆయన డిప్యూటీ స్పీకర్  పదవిని చేపట్టగానే మరో విప్ పదవి ఖాళీ కానుంది. దీంతో ఈ రెండు విప్ పదవుల్లో ఒకటి కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక మరో విప్ పదవి ఎస్టీ సామాజిక వర్గానికి ఇచ్చే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

అలాగే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ గా ప్రతిపక్ష బీఆర్ఎస్​కు చెందిన అరికెపూడి గాంధీని నియమించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో మరో కీలకమైన పబ్లిక్ ఎస్టిమేట్ కమిటీ (పీఈసీ) చైర్మన్ పదవిలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిని నియమించగా, ఆ పదవి చేపట్టేందుకు ఆమె నిరాకరించారు. తనకు ఆర్టీసీ చైర్మన్, లేదంటే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కావాలని అడుగుతున్నట్టు పీసీసీలో చర్చ సాగుతోంది. దీంతో పీఈసీ పదవిలో మరో సీనియర్ ఎమ్మెల్యేను నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.