ఉద్యోగుల పెన్షన్ స్కీమ్లో మార్పులు

ఉద్యోగుల పెన్షన్ స్కీమ్లో మార్పులు

న్యూఢిల్లీ: నెలకు రూ. 15వేల కంటే ఎక్కువ బేసిక్​ శాలరీ పొందుతున్న ఉద్యోగులు రిటైర్​మెంట్ తర్వాత ఇంకా ఎక్కువ పెన్షన్​ పొందేలా రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ కొత్త పెన్షన్​ స్కీమ్​ను తీసుకురావాలని భావిస్తోంది. పెన్షన్ స్కీమ్ 1995 (ఈపీఎస్​95) పరిధిలోకి రాని ఫార్మల్​ సెక్టార్​ ఉద్యోగుల కోసం ఇది అందుబాటులో ఉంటుంది. సర్వీసులో చేరే సమయంలో నెలకు రూ. 15 వేల వరకు బేసిక్​ శాలరీ (బేసిక్​ శాలరీ+డియర్‌‌‌‌నెస్ అలవెన్స్) ఉన్న  ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఈపీఎస్​95 కింద పెన్షన్​ స్కీము లాభాలను పొందుతారు. "ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)కు ఎక్కువ మొత్తం చెల్లించే వారికి ఎక్కువ పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. అందువల్ల, నెలవారీ బేసిక్​ శాలరీ రూ.15 వేలు, అంతకంటే ఎక్కువ ఉన్న వారి కోసం కొత్త పెన్షన్ ప్రొడక్టు లేదా స్కీమ్ తీసుకురావాలనే ప్రపోజల్​ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం చాలా మంది రూ.15 వేల కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నా, పెన్షన్​ తక్కువగానే ఉంటోంది. ఎందుకంటే పెన్షనబుల్​ బేసిక్​ శాలరీ రూ.15 వేలకే పరిమితం" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆఫీసర్​ ఒకరు వెల్లడించారు. వచ్చే నెల 11,  12 తేదీల్లో గౌహతిలో జరిగే ఈపీఎఫ్ఓ అపెక్స్ డెసిషన్ మేకింగ్ బాడీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈ కొత్త పెన్షన్ స్కీముపై చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.   పెన్షన్ సంబంధిత సమస్యలపై సీబీటీ ఏర్పాటు చేసిన సబ్-కమిటీ కూడా సమావేశం సందర్భంగా తన నివేదికను కూడా సమర్పిస్తుంది. చాలా మంది ఈపీఎఫ్ఓ సబ్‌‌‌‌స్క్రయిబర్లు రూ. 15వేల కంటే ఎక్కువ నెలవారీ బేసిక్​ శాలరీ  పొందుతున్నారు. అయినప్పటికీ వీరంతా తక్కువ (నెలకు రూ. 15వేలలో 8.33 శాతం చొప్పున ) చందా చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి తక్కువ పెన్షన్ వస్తోంది. నెలవారీ పెన్షనబుల్​ బేసిక్ శాలరీను రూ.15వేలకు పరిమితం చేసేందుకు ఈపీఎఫ్​ఓ 2014లో ఈ స్కీమ్​లో మార్పులు చేసింది. ఉద్యోగంలో చేరిన సమయంలో మాత్రమే రూ.15 వేల పరిధి వర్తిస్తుందని ప్రకటించింది.

రూ.25 వేలకు పెంచాలని డిమాండ్​

ధరల పెరుగుదల, శాలరీల్లో మార్పుల కారణంగా సెప్టెంబర్ 2014 నుండి పెన్షనబుల్​ బేసిక్ శాలరీ పరిమితిని రూ.6,500 నుండి రూ.15 వేలకు మార్చారు. ఈ మొత్తాన్ని రూ.25వేలకి పెంచాలని డిమాండ్లు, చర్చలు జరిగినా, ఆ ప్రతిపాదన ఆమోదం పొందలేదు.  పెన్షనబుల్ శాలరీని పెంచడం వల్ల 50 లక్షల మంది అధికారిక రంగ కార్మికులను ఈపీఎస్​95 పరిధిలోకి తీసుకురావచ్చు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్స్ & ఇతర ప్రొవిజన్స్ యాక్ట్, 1952 కింద కవరేజీ కోసం శాలరీ పరిమితిని నెలకు రూ. 15వేల నుండి నెలకు రూ. 25వేలకి పెంచే ప్రతిపాదనను ఉద్యోగుల ఈపీఎఫ్ఓ సమర్పించినా, దీనిపై నిర్ణయం మాత్రం తీసుకోలేదని అప్పటి కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ డిసెంబర్ 2016 లో లోక్‌‌‌‌సభలో రాతపూర్వకంగా చెప్పారు.  సర్వీసులో చేరే సమయంలో వారి నెలవారీ బేసిక్ శాలరీ రూ. 15 వేల కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, తక్కువ మొత్తం కట్టేవారికి లేదా స్కీమ్‌‌‌‌ పరిధిలోకి రానివారికి కొత్త పెన్షన్ స్కీము అవసరమని యూనియన్లు అంటున్నాయి.  ఈపీఎఫ్ఓ​ద్వారా పెన్షన్ జీతం పరిమితిని పెంచడానికి ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రపోజల్​ లేదని సంబంధిత ఆఫీసర్​ చెప్పారు. పింఛను పొందగల జీతం పరిమితి విషయమై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరుగుతోంది. కేరళ హైకోర్టు... ఉద్యోగులు బేసిక్ శాలరీ పరిమితి కంటే ఎక్కువ మొత్తం జమచేయడానికి 2014లో అనుమతించింది. అయితే  కేరళ హైకోర్టు తీర్పుపై ఈపీఎఫ్ఓ ఏప్రిల్ 2019లో​​దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌‌‌‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈపీఎఫ్‌‌‌‌వో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌‌‌‌ విచారణ సందర్భంగా కూడా ఈ విషయాన్ని ఎత్తిచూపింది. ఈపీఎఫ్ఓ, కేంద్రంపై ధిక్కార చర్యలను ప్రారంభించకుండా గత ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు కేరళ, ఢిల్లీ  రాజస్థాన్ హైకోర్టులను ఆపింది.