ఈ వంద రోజులు జనంలోనే ఉండండి.. ప్రజా సమస్యలపై పోరాడండి

ఈ వంద రోజులు జనంలోనే ఉండండి.. ప్రజా సమస్యలపై పోరాడండి
  • బీజేపీ నేతలకు జవదేకర్, బన్సల్ పిలుపు
  • కవితపై చర్యలు లేకపోవడంతో ప్రజల్లో చర్చ జరుగుతోందన్న మాజీలు 
  • అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ముందే ప్రకటించాలని విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడ్డ నేపథ్యంలో రానున్న వంద రోజులు జనంలోనే ఉండాలని, ప్రజా సమస్యలపై పోరాడాలని బీజేపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్​చార్జ్ ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్ చార్జ్ సునీల్ బన్సల్ పిలుపునిచ్చారు. అప్పుడే జనంలో ఆదరణ పెరుగుతుందని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నేతలు.. ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో పని మొదలుపెట్టాలని సూచించారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీలోని మాజీ ప్రజాప్రతినిధులతో మీటింగ్ జరిగింది. ఇందులో మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు పాల్గొన్నారు. వాళ్లకు జవదేకర్, బన్సల్ దిశానిర్దేశం చేశారు.

ఎన్నికలకు సమయం లేదు. పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతూ, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి. మోదీ పాలనపై జనం సంతృప్తిగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తున్నది. ఇవి మనకు కలిసివస్తాయి. ప్రజల్లోకి వెళ్లి, వాళ్ల నమ్మకాన్ని పొందాలి” అని సూచించారు. ‘‘ఇకపై పార్టీ నేతలకు మేం అందుబాటులో ఉంటాం. ఎలాంటి సమస్యలున్నా మాతో చెప్పొచ్చు. కిషన్ రెడ్డి అందుబాటులో లేనప్పుడు సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి పార్టీ వ్యవహారాలు చూసుకుంటారు” అని చెప్పారు. మాజీ ప్రజాప్రతినిధులకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎవరెవరు? ఏ నియోజకవర్గం? నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. 

ఎన్నికలకు 22 కమిటీలు.. 

రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై నేతల అభిప్రాయాలను జవదేకర్, బన్సల్ అడిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోకపోవడంపై జనంలో చర్చ జరుగుతున్నదని నేతలు చెప్పారు. ఇప్పటికైనా తమను గుర్తించినందుకు సంతోషంగా ఉందని, ఏ బాధ్యత అప్పగించిన చేస్తామన్నారు. ఎన్నికలకు అభ్యర్థులను ముందే ప్రకటిస్తే బాగుంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు ఈ నెలాఖరు వరకు 22 కమిటీలు ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీతో పాటు మేనిఫెస్టో, చార్జ్ షీట్, మీడియా, స్ట్రాటజీ, పబ్లిక్ మీటింగ్స్, కోఆర్డినేషన్ తదితర కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. 

మోర్చాల అధ్యక్షులతో కిషన్ రెడ్డి మీటింగ్..  

బీజేపీ అనుబంధ మోర్చాలతో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ శనివారం స్టేట్ ఆఫీసులో సమావేశమయ్యారు. ఇందులో మోర్చాల అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. 100 రోజుల ప్రణాళికపై దృష్టి పెట్టాలని నేతలకు సూచించారు. ఎన్నికలయ్యే వరకు మోర్చాలలో మార్పు ఉండవన్నారు. కాగా, హైదరాబాద్ శివారు ఘట్కేసర్​లో రెండ్రోజుల పాటు జరిగిన విస్తారక్​ల సమావేశం శనివారంతో ముగిసింది. రాష్ట్రంలోని లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల విస్తారక్‌లు ఇందులో పాల్గొన్నారు.  దీనికి ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్, శివ ప్రకాశ్, అరవింద్ మీనన్, కిషన్ రెడ్డి హాజరయ్యారు. 

కోర్ కమిటీలో కీలక నిర్ణయాలు

హైదరాబాద్ లోని ఓ హోటల్ లో శుక్రవారం అర్ధరాత్రి వరకు జరిగిన బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ను ఎదుర్కోవడం.. వంద రోజుల ప్రణాళికతో ముందుకెళ్లడంపై చర్చించారు. రాష్ట్ర పర్యటనకు రానున్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా,  పార్టీ చీఫ్ జేపీ నడ్డాల సభలు, సమావేశాల బాధ్యతను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ కు అప్పగించారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను జాతీయ సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్, జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ చూసుకుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, మిగతా వ్యవహారాలు ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్ చూసుకుంటారు. ఈ నెల 26 న మరోసారి కోర్ కమిటీ సమావేశమై, అసెంబ్లీ ఎన్నికలకు రోడ్ మ్యాప్ ఖరారు చేయనుంది.